తమన్నా, కాజల్‌ ను ప్రశ్నించనున్న పుదుచ్చేరి పోలీసులు !

తమన్నా, కాజల్‌ ను ప్రశ్నించనున్న పుదుచ్చేరి పోలీసులు !
X

కోయంబత్తూరు కేంద్రంగా 2022లో ప్రారంభమైన క్రిప్టోకరెన్సీ కంపెనీ భారీ మోసానికి పాల్పడిందని ఆరోపణల నేపథ్యంలో.. ప్రముఖ సినీ తారలు తమన్నా భాటియా, కాజల్ అగర్వాల్‌పై పుదుచ్చేరి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భారీ లాభాల మాటలు చెప్పి ఈ సంస్థ కోట్లాది రూపాయలు మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

కంపెనీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తమన్నా హాజరుకాగా, కాజల్ సంస్థ నిర్వహించిన ఓ కీలక ఈవెంట్‌లో ప్రముఖ పెట్టుబడిదారులకు ఖరీదైన బహుమతులను అందజేశారు. ముంబైలో లగ్జరీ క్రూయిజ్ పార్టీ నిర్వహించి మరిన్ని పెట్టుబడులు సమీకరించినట్టు సమాచారం. పుదుచ్చేరికి చెందిన కనీసం 10 మంది ఈ స్కాములో రూ. 2.4 కోట్లను కోల్పోయారని.. ఒక మాజీ ప్రభుత్వ ఉద్యోగి అయితే ఏకంగా రూ. 40 కోట్లు పోగొట్టుకున్నారని నివేదికలు చెబుతున్నాయి.

పలు ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, నితీష్ జైన్, అరవింద్ కుమార్ అనే ఇద్దరు కీలక నిందితులను అరెస్ట్ చేశారు. ఈ మోసం ఢిల్లీ, ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ వంటి రాష్ట్రాలకు విస్తరించింది. నిందితులు నకిలీ ఆన్‌లైన్ ఖాతాల ద్వారా ప్రజలను మోసం చేసినట్లు గుర్తించారు. స్కాంలో ప్రమేయమున్న మరో వ్యక్తి ఇమ్రాన్ పాషాను ఇప్పటికే రాయ్‌పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా కొందరు నిందితులు పరారీలో ఉండగా, వారిని పట్టుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

తమన్నా, కాజల్ సంస్థ ఈవెంట్లలో భాగమవడంతో, వారు కేవలం ప్రచార హోదాలో ఉన్నారా లేదా ఆర్థికంగా ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టనున్నారు. ఈ భారీ కుంభకోణం ఎలా అమలు చేయబడిందో తెలుసుకునే దిశగా దర్యాప్తు కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా దృష్టి నిలిచిన ఈ కేసులో, నిజమైన నిందితులను గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి అధికారులు కృషి చేస్తున్నారు.

Tags

Next Story