దర్శకుడు శేఖర్ కపూర్‌కు పద్మభూషణ్ గౌరవం!

ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో హిందీ చిత్ర రంగం నుంచి శేఖర్ కపూర్ ను పద్మభూషణ్ వరించింది. దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా, బహుముఖ ప్రజ్ఞాశాలి శేఖర్ కపూర్. శేఖర్ కపూర్ పేరుచెబితే భారతీయ సినీ ప్రియులకు కళాత్మకత, వైవిధ్యభరితమైన కథలు, అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన సినిమాలు గుర్తుకొస్తాయి.
శేఖర్ కపూర్ తన సినీ ప్రస్థానాన్ని సహాయ నటుడిగా ప్రారంభించారు. కొన్ని చిత్రాల్లో చిన్న పాత్రల్లో మెరిసిన ఆయన, తరువాత దర్శకుడిగా భారతీయ చిత్రసీమలో తన ప్రత్యేకతను చాటుకున్నారు. 1983లో శేఖర్ దర్శకత్వంలో వచ్చిన తొలి చిత్రం ‘మసూమ్’ ఆయన ప్రతిభకు నిదర్శనం. కుటుంబ సంబంధాలు, నైతిక సవాళ్ల నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల అభిమానాన్ని పొందింది.
1987లో వచ్చిన ‘మిస్టర్ ఇండియా’ శేఖర్ కపూర్‌కి భారీ పాపులారిటీ తెచ్చిన చిత్రం. విజువల్ ఎఫెక్ట్స్, వినోదం, కుటుంబ అనుబంధాలను సమపాళ్లలో మేళవించి ఈ సినిమా భారతీయ కమర్షియల్ చిత్రసీమలో ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది.
1994లో విడుదలైన ‘బండిట్ క్వీన్’ పూలన్ దేవి జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం. నిజ జీవిత కథను తీవ్ర భావోద్వేగాలతో తెరకెక్కించిన ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో శేఖర్ కపూర్ పేరును మరింత ప్రాచుర్యంలోకి తెచ్చింది. ఈ చిత్రం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సహా పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శించబడింది.
1998లో శేఖర్ రూపొందించిన ‘ఎలిజిబెత్’ చారిత్రక నేపథ్యంతో రూపొందిన చిత్రంగా అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం ఏకంగా ఏడు అకాడమీ అవార్డులకు నామినేట్ కావడం, శేఖర్‌ను అంతర్జాతీయ దర్శకుల గణంలో నిలబెట్టింది.
-
Home
-
Menu