‘ఓదెల 2‘ మూవీ హైలైట్స్!

తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి పాన్ ఇండియా స్థాయిలో రేపు (ఏప్రిల్ 17) విడుదలకు సిద్ధమైంది ‘ఓదెల 2’. మిల్కీ బ్యూటీ తమన్నా శివశక్తిగా నాగసాధు గెటప్‌లో కనిపించబోతున్న చిత్రమిది. ‘ఎఫ్ 3‘ తర్వాత తమన్నా నటించిన తెలుగు చిత్రాలేవీ విజయాలు సాధించలేదు. దీంతో.. ‘ఓదెల 2‘తో మళ్లీ తెలుగులో మంచి కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తుంది తమన్నా.
దర్శకుడు సంపత్ నంది కథతో అశోక్ తేజ తెరకెక్కించిన ‘ఓదెల రైల్వే స్టేషన్‘ డైరెక్ట్ ఓటీటీలో రిలీజై మంచి విజయాన్ని సాధించింది. ఆ చిత్రానికి కొనసాగింపుగానే ‘ఓదెల 2‘ తెరకెక్కింది. ఫస్ట్ పార్ట్ లో లీడ్ రోల్ చేసిన హెబ్బా పటేల్ కూడా ఇప్పుడు సీక్వెల్ లో కనిపించబోతుంది. ఇంకా వశిష్ట ఎన్.సింహా, యువ, నాగ మహేష్ తదితరులు కీలక పాత్రల్లో మెరవనున్నారు.
దైవత్వం మరియు తంత్ర శక్తుల మధ్య జరిగిన పోరాటం ప్రధాన ఇతివృత్తంగా ‘ఓదెల 2‘ని తీర్చిదిద్దారు. ఈ సినిమాలో శివశక్తిగా తమన్నా స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్స్ ఆకట్టుకుంటాయట. మరోవైపు, ‘కాంతార, విరూపాక్ష’ వంటి సినిమాల విజయంలో ఎంతో కీలక పాత్ర పోషించిన అజనీష్ లోక్ నాథ్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చాడు. ఆయన అందించిన బి.జి.ఎమ్. టాప్ నాట్చ్ లో ఉండబోతుందట.
బిజినెస్ పరంగా కూడా ‘ఓదెల 2’కి మంచి ఆఫర్స్ వచ్చినట్టు ఫిల్మ్ నగర్ టాక్. థియేట్రికల్ హక్కుల రూపంలో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ కలిపి దాదాపు రూ.10 కోట్లు రాబట్టగా, డిజిటల్, శాటిలైట్, ఆడియో వంటి నాన్-థియేట్రికల్ హక్కులు రూ.18 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. అంటే, విడుదలకు ముందే రూ.28 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందన్నమాట. మొత్తంగా రేపు మంచి అంచనాలతో వస్తోన్న ‘ఓదెల 2‘ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
-
Home
-
Menu