‘యల్2: ఎంపురాన్’ చిత్రానికి సెన్సార్ పూర్తి !

ది కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ‘యల్2: ఎంపురాన్’. తాజాగా ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికేట్ మంజూరు చేసింది. దీనికి ప్రముఖ నటుడు పృధ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం 2019 లో విడుదలై భారీ విజయం సాధించిన ‘లూసిఫర్’ కి కొనసాగింపుగా వస్తోంది. ఈ చిత్రంలో పృధ్విరాజ్ తన పాత్ర జయిద్ మసూద్‌గా తిరిగి కనిపించనున్నారు.
లూసిఫర్ కథలో కీలకమైన ఖురేషీ అబ్రహాం నేర సంస్థ హిట్ స్క్వాడ్‌కు నాయకత్వం వహించే అద్భుతమైన మిలిటరీ కమాండోగా ఆయన పోషించిన పాత్ర మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఇంతకు ముందు విడుదలైన ఒక ప్రోమో వీడియోలో, పృధ్విరాజ్ ‘లూసిఫర్’లో ఉన్న క్లిష్టమైన కథా గమనాన్ని గుర్తు చేస్తూ.. ‘ఎంపురాన్’ లో అది మరింత లోతుగా అభివృద్ధి అవుతుందని తెలిపారు. ఈ సీక్వెల్‌లో పాత్రలు, లోకేషన్లు విస్తృతంగా ఉండబోతున్నా, కథాగమనానికి స్పష్టత ఉంటుందని తెలిపారు.
‘లూసిఫర్’ ముగింపు తర్వాత.. ఖురేషీ అబ్రహాం మాఫియా సామ్రాజ్యాన్ని ఎవ్వరూ ఎదుర్కొనలేరనే అభిప్రాయం ప్రేక్షకుల్లో కలిగిందని.. కానీ అది నిజమా లేక తప్పుదారి పట్టించే ఊహామాత్రమా అన్న ప్రశ్నను పృధ్విరాజ్ ఈ సినిమాలో సమాధానం ఇవ్వబోతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఈ చిత్రాన్ని ఆంటోని పెరుంబవూర్, సుభాస్కరన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మురళీ గోపీ కథను అందించగా.. దీపక్ దేవ్ సంగీతాన్ని సమకూర్చారు.
2019లో విడుదలైన ‘లూసిఫర్’ చిత్రం పృధ్విరాజ్ సుకుమారన్ దర్శకుడిగా పరిచయమైన మొదటి చిత్రం. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద 200 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించి, అప్పటి వరకు మలయాళ సినీ పరిశ్రమలో అత్యధిక గ్రాసింగ్ సినిమాగా నిలిచింది. ‘యల్ 2: ఎంపురాన్’ చిత్రం ఇంకా విస్తృతమైన కథనంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు స్పష్టమవుతోంది.
-
Home
-
Menu