లిప్ లాక్స్, రొమాంటిక్ సిన్స్ కు ఈ హీరో దూరం !

లిప్ లాక్స్, రొమాంటిక్ సిన్స్ కు ఈ హీరో దూరం !
X

మలయాళ సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్న ఉన్ని ముకుందన్‌ తాజాగా ‘మార్కో’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మలయాళ సినీ చరిత్రలోనే కొత్త రికార్డులు సృష్టించింది. ‘ఎ’ సర్టిఫికెట్‌ పొందినప్పటికీ, 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్‌ను సాధించిన మొదటి మలయాళ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రంలో ఆయన పోషించిన పవర్‌ఫుల్‌ పాత్ర, హై ఓల్టేజ్ యాక్షన్‌ సన్నివేశాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘మార్కో’లోని యాక్షన్‌ సీన్స్‌ మరో ‘కేజీఎఫ్‌’, ‘సలార్‌’ స్థాయిలో ఉన్నాయని సినీ విమర్శకులు ప్రశంసలు కురిపించారు.

ఇండస్ట్రీలో ఎంతోకాలంగా కొనసాగుతున్న ఉన్ని ముకుందన్‌కి ఇదే అతని కెరీర్‌లో అత్యంత భారీ విజయం అని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ, ఆయన సినిమాల్లో ఒక నిబంధన పాటిస్తూ వస్తున్నాడు. రొమాంటిక్, ఇంటిమేట్ సన్నివేశాలకు తాను దూరంగా ఉంటానని స్పష్టం చేశాడు. యాక్షన్‌ సన్నివేశాల్లో ఎంత కష్టమైన సన్నివేశమైనా ప్రాణం పణంగా పెట్టి చేసే ఉన్ని ముకుందన్‌, రొమాంటిక్‌ సన్నివేశాలకు మాత్రం ససేమిరా అంగీకరించడు.

తన కెరీర్ బిగినింగ్ నుంచీ ఉన్ని ముకుందన్‌ ముద్దు సన్నివేశాల్లో, ఇంటిమేట్‌ సీన్స్‌లో కనిపించలేదు. దర్శకులు, నిర్మాతలు ఎంత ఒత్తిడి చేసినా తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఈ విషయంపై ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘‘సినిమాల్లో అడుగుపెట్టినప్పుడే కొన్ని నిబంధనలు పెట్టుకున్నాను. అందులో ఒకటి రొమాంటిక్‌ సన్నివేశాల్లో నటించకూడదు అన్నది. కొంతమంది దర్శకులు అలాంటి సీన్స్‌ చేయాలని ఒత్తిడి చేసినా నా సిద్ధాంతాన్ని మార్చుకోలేదు. ప్రేమను వ్యక్తీకరించేందుకు ముద్దు మాత్రమే మార్గం కాదు’’ అని స్పష్టం చేశారు.

తన నిర్ణయంతో కొన్నిసార్లు మంచి అవకాశాలు కోల్పోయానని, కానీ తన విలువలకు రాజీపడలేదని ఆయన తెలిపారు. ‘‘ఇతర నటులు ఏం చేస్తారో వారి ఇష్టం. కానీ నేను నా విధానాన్ని కొనసాగిస్తాను. ఇది ఎవరికైనా వ్యతిరేకం కాదు. నా పద్ధతిని అనుసరిస్తూ నా ప్రయాణం కొనసాగిస్తాను’’ అని ఉన్ని ముకుందన్‌ అన్నారు. భవిష్యత్తులో కూడా తన సినిమాల్లో రొమాంటిక్‌ సన్నివేశాలు ఉండవని స్పష్టంగా చెప్పారు. అతని ఈ నిబద్ధత, తన విలువలకు కట్టుబడి ఉండే తత్వం సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది.

Tags

Next Story