షూటింగ్ రీస్టార్ట్ కాబోతోంది !

మలయాళ రెబల్ స్టార్, కేంద్ర మంత్రి సురేష్ గోపి నటిస్తున్న 250వ చిత్రం “ఒట్టకొంబన్” చిత్రం షూటింగ్ ఎట్టకేలకు రీస్టార్ట్ కాబోతోంది. అనేక వాయిదాల తరువాత ఈ సినిమా విశు పండుగ అనంతరం ఏప్రిల్ 15 నుండి తిరిగి షూటింగ్ జరుపుకోనుంది. ఈ విషయాన్ని నిర్మాత గోకులం గోపాలన్ అధికారికంగా ప్రకటించారు. సురేష్ గోపికి ఉన్న మంత్రి బాధ్యతలే ఈ వాయిదాకు ప్రధాన కారణమని ఆయన వెల్లడించారు. ముందుగా ఏప్రిల్ 7న షూటింగ్ మొదలవ్వాల్సి ఉన్నా.. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలకు అనుగుణంగా షెడ్యూల్ పలు మార్లు మార్చాల్సి వచ్చింది.
ఈ చిత్రం అనేక సంవత్సరాల క్రితమే ప్రకటించబడినా.. చట్టపరమైన సమస్యలు, వ్యవస్థాపన లోపాలు, కరోనా మహమ్మారి ప్రభావం వంటి కారణాల వల్ల పదే పదే వాయిదా పడింది. ఎట్టకేలకు 2024 డిసెంబర్‌లో మొదటిసారి షూటింగ్ మొదలైంది. ఈ సినిమాకు మాథ్యూస్ థామస్ దర్శకత్వం వహిస్తుండగా, కథను శిబిన్ ఫ్రాన్సిస్ అందించారు. ఈ చిత్రంలో సురేష్ గోపి ‘కడవక్కునేల్ కురువాచన్’ అనే పాత్రలో కనిపించనున్నాడు. ఈ పాత్ర ఒక నిజమైన వ్యక్తిని ఆధారంగా చేసుకుని రూపొందించినట్టు సమాచారం.
ఈ చిత్రంలో ఇంద్రజిత్ సుకుమారన్, విజయరాఘవన్, లాలు అలెక్స్, చెంబన్ వినోద్ జోస్, కబీర్ దుహాన్ సింగ్, జానీ అంటోని, బిజు పప్పన్, మేఘన రాజ్, సుచిత్రా నాయర్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని హర్షవర్ధన్ రమేశ్వర్ అందిస్తున్నారు. ఆయన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ చిత్రాలకు సంగీతాన్ని అందించి పేరుగాంచారు. ప్రస్తుతం ఆయన హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న “నోబడి” అనే మలయాళ చిత్రానికి కూడా సంగీతం అందిస్తున్నారు. మరి ‘ఒట్టకొంబన్’ గా సురేశ్ గోపీ ఏ రేంజ్ లో మెప్పిస్తారో చూడాలి.
-
Home
-
Menu