తమిళం, తెలుగు భాషల్లోకి సూపర్ హిట్ మలయాళ థ్రిల్లర్

తమిళం, తెలుగు భాషల్లోకి సూపర్ హిట్ మలయాళ థ్రిల్లర్
X

కుంచాకో బోబన్ మెయిన్ లీడ్ లో నటించిన ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ చిత్రం ప్రస్తుతం మాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. తాజాగా ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు భాషల్లోకి అనువదించనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. మార్చిలో ఈ డబ్బింగ్ వెర్షన్లు విడుదల కానున్నప్పటికీ.. ఖచ్చితమైన తేదీని ఇంకా నిర్ధారించలేదు. ఈ చిత్రానికి డబ్బింగ్ హక్కులను ఈఫోర్ ఎంటర్‌టైన్‌మెంట్ స్వాధీనం చేసుకుంది.

ఫిబ్రవరి 20న మలయాళంలో విడుదలైన ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ మూవీ విమర్శకుల నుంచి, ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. విడుదలైన మొదటి వారంలోనే మంచి వసూళ్లు సాధించిన ఈ సినిమా.. తదుపరి రోజుల్లో మరింత బలంగా ముందుకు సాగింది. బుక్ మై షో వివరాల ఆధారంగా.. చిత్రబృందం వెల్లడించిన సమాచారం ప్రకారం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద స్థిరంగా పెరుగుతున్న ట్రెండ్‌ను కొనసాగిస్తోంది. విడుదలైన ఆరు రోజుల్లోనే కేరళలో ఈ చిత్రం రూ. 12 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసినట్లు సమాచారం.

దర్శకుడిగా జితు అశ్రఫ్‌కు ఇది మొదటి సినిమా. షాహి కబీర్ కథను అందించిన ఈ చిత్రంలో ప్రియమణి, జగదీష్, విశాఖ్ నాయర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ‘కన్నూర్ స్క్వాడ్’ చిత్ర దర్శకుడు రోబీ వర్గీస్ రాజ్ సినిమాటోగ్రఫీ అందించగా.. జేక్స్ బీజాయ్ సంగీతాన్ని అందించారు. చమన్ చాకో ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ఈ చిత్రాన్ని మార్టిన్ ప్రకట్ ఫిలిమ్స్, ది గ్రీన్ రూమ్ సంస్థలతో కలిసి నిర్మించింది.

డెబ్యూ డైరెక్టర్ జితు అశ్రఫ్ మొదటి భాగాన్ని వేగంగా నడిపించాడు. హరి శంకర్ అనే పోలీసు అధికారి చిన్న గొలుసు దొంగతనాన్ని పరిశీలిస్తుండగా.. అది అతని కుటుంబాన్ని ప్రభావితం చేసే ప్రమాదకరమైన నేరాలకు దారితీస్తుంది. షాహి కబీర్ రాసిన మిగతా కథలతో పోలిస్తే, ఈ సినిమా స్క్రీన్‌ప్లే చాలా వేగంగా సాగుతుంది. ప్రేక్షకుల్లో ఊపిరి సలపని ఉత్కంఠను కలిగిస్తుంది. ఈ చిత్రం మలయాళంలో విజయవంతమైన నేపథ్యంలో.. తెలుగు, తమిళ భాషల్లో విడుదలయ్యే డబ్బింగ్ వెర్షన్లు కూడా మంచి ఆదరణ పొందే అవకాశం ఉంది.

Tags

Next Story