ప్రణవ్ మోహన్ లాల్ మళ్ళీ బిజీ అవుతున్నాడు !

స్టార్ హీరో మోహన్ లాల్ తనయుడు అయినప్పటికీ.. ఆ పేరు ఉపయోగించుకుని అవకాశాలు దక్కించుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు ప్రణవ్ మోహన్ లాల్. స్వంత గుర్తింపు కోసం ప్రయత్నిస్తూ, తన సినీ ప్రయాణాన్ని హీరోగా కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్‌గా మొదలుపెట్టాడు. అంతేకాదు, తనకున్న సంగీత ప్రతిభను కూడా నిరూపించుకుంటూ, సింగర్‌గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. 2018లో విడుదలైన ఆది సినిమాతో హీరోగా అడుగుపెట్టిన ప్రణవ్.. గత ఏడు సంవత్సరాల్లో కేవలం ఐదు సినిమాలకే పరిమితమయ్యాడు. కథలను చాలా సెలక్టివ్‌గా ఎంచుకుంటూ, హృదయం, వర్షంగళుక్కు శేషం వంటి వరుస హిట్‌లను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఈ విజయాలతో అతడి కెరీర్ తండ్రిలా టాప్ లెవల్‌కి చేరిపోతుందని అంతా భావించారు. అయితే, ప్రణవ్ మాత్రం మిగతా స్టార్ కిడ్స్‌లా హడావుడి చేయకుండా, సినిమాలకు కొంత విరామం ఇచ్చి స్పెయిన్ వెళ్లిపోయాడు. అక్కడ సాధారణ జీవితం ఆస్వాదిస్తూ సినిమాలకు గుడ్‌బై చెప్పేశాడా అనే సందేహాలను అభిమానుల్లో కలిగించాడు. అయితే, ఇప్పుడు మళ్లీ మాలీవుడ్‌లో ప్రణవ్ రీఎంట్రీపై ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ‘భ్రమయుగం’ ఫేమ్ రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో ఓ కొత్త సినిమాకు ప్రణవ్ సైన్ చేసినట్లు సమాచారం. ఏప్రిల్ 2న వడకరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని ఇండస్ట్రీలో బలమైన టాక్ ఉంది.
హారర్ మిస్టరీ జానర్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాను నైట్ షిఫ్ట్, వైనాట్ స్టూడియోస్ నిర్మించనున్నాయి. తన తండ్రి స్టార్ ఇమేజ్‌ను క్యాష్ చేసుకోవాలని భావించకుండా, స్వయంగా ఎదగాలనుకునే ప్రణవ్ మోహన్ లాల్ లాంటి హీరోలు ఈ రోజుల్లో చాలా అరుదు. ఇప్పుడు ఆయన మళ్లీ వెండితెరపై మెరవబోతున్న వార్తతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.
-
Home
-
Menu