మళ్ళీ మాలీవుడ్ లోకి నయనతార !

సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార మళ్లీ మాలీవుడ్‌లో అడుగుపెట్టబోతోంది. 2022లో పృధ్విరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన ‘గోల్డ్’ సినిమా తర్వాత మరో మళయాళ చిత్రంలో కనిపించలేదు. అయితే ఇప్పుడు మళ్లీ మూడేళ్ళ తర్వాత మాలీవుడ్ లో ఒక భారీ చిత్రానికి కమిట్ అయింది. మహేష్ నారాయణన్ తెరకెక్కిస్తున్న ఓ క్రేజీ మల్టీ-స్టారర్ సినిమాలో ఆమె ముఖ్య పాత్ర పోషించనుంది. ఈ చిత్రం మరో ప్రత్యేకత ఏమిటంటే.. దాదాపు 18 సంవత్సరాల తరువాత మమ్ముట్టి - మోహన్‌లాల్ కలిసి నటిస్తున్న చిత్రం ఇదే కావడం.
తాజాగా .. చిత్రబృందం తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించింది. నయనతార చిత్రీకరణలో భాగస్వామ్యం అయ్యిందని తెలియజేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో నయనతార మెగాస్టార్ మమ్ముట్టి, దర్శకుడు మహేష్ నారాయణన్‌లతో ముచ్చటిస్తున్నట్లు కనిపించింది. నయనతార, మమ్ముట్టి కాంబినేషన్ లో గతంలో ‘తస్కర వీరన్ , రాప్పగల్’ చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత ‘భాస్కర్ ది రాస్కల్, పుదియ నియమం చిత్రాల్లో జోడీగా నటించింది.
ఈ సినిమా చిత్రీకరణ నాలుగో షెడ్యూల్‌లో ఉంది. ప్రస్తుతం కొచ్చిలో షూటింగ్ జరుగుతోంది. ఇటీవల రేవతి పాల్గొన్న కీలక సన్నివేశాలు పూర్తి చేశారు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో ఫహద్ ఫాజిల్, కుంచాకో బోబన్ సహా పలువురు ప్రముఖ నటులు నటిస్తున్నారు. తొలి షెడ్యూల్ శ్రీలంకలో మొదలై, తర్వాత షార్జా, అజర్బైజాన్‌లలో షూటింగ్ జరిగింది. మళ్లీ శ్రీలంకలో నాలుగో షెడ్యూల్ చిత్రీకరణ పూర్తయింది. తదుపరి షెడ్యూల్ ఢిల్లీలో జరగనుంది, అక్కడ మోహన్‌లాల్, మమ్ముట్టి, రేవతి కీలక సన్నివేశాల్లో కనిపించనున్నారు.
ఈ భారీ తారాగణంలో రాజీవ్ మీనన్, దానిష్ హుస్సేన్, రంజి పనిక్కర్, సనల్ అమన్, షాహీన్ సిద్ధిఖీ, దర్శనా రాజేంద్రన్, జరీన్ షిహాబ్ వంటి నటులు ఉన్నారు. మహేష్ నారాయణన్‌కి ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్. "సీయూ సూన్", "టేక్ ఆఫ్", "మాలిక్", "అరియిప్పు" వంటి సినిమాలతో పేరు తెచ్చుకున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో చిత్రీకరణ జరుగుతుండటంతో ఈ సినిమా ఎప్పుడు పూర్తి అవుతుందనేది స్పష్టత లేదు.
-
Home
-
Menu