జూన్ 1 నుంచి మలయాళ ఇండస్ట్రీ బంద్ !

మలయాళ సినీ పరిశ్రమ ప్రస్తుతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొ్ంటోంది. ఇటీవల వివిధ సినిమా సంఘాలు సమావేశమై పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించాయి. ఈ నేపథ్యంలో, పరిశ్రమపై విధించబడిన జీఎస్టీ వినోదపు పన్నును తొలగించాలని డిమాండ్ చేస్తూ, మలయాళ సినీ పరిశ్రమ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ మేరకు జూన్ 1, 2025 నుండి సినిమా షూటింగ్‌లు, థియేటర్లలో ప్రదర్శనలు సహా అన్ని సినీ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి.
ప్రముఖ మలయాళ నిర్మాత.. నటి కీర్తి సురేష్ తండ్రి సురేష్ కుమార్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. "దేశంలో ఏ పరిశ్రమకూ 30% పన్ను విధించబడడం లేదు. కానీ మలయాళ సినీ పరిశ్రమపై జీఎస్టీతో పాటు అదనపు వినోదపు పన్ను కూడా విధించబడింది. ప్రభుత్వం ఈ విషయంలో చర్య తీసుకోవాలి. అంతేకాదు, నటీనటుల పారితోషికం కూడా విపరీతంగా పెరిగిపోతోంది. దీన్ని అదుపులోకి తేవాల్సిన అవసరం ఉంది," అని ఆయన తెలిపారు.
నిర్మాత సురేష్ కుమార్ మాట్లాడుతూ.. "ఒక సినిమా బడ్జెట్‌లో 60% మొత్తాన్ని నటీనటులు తీసుకుంటున్నారు. ఇది నిర్మాతలకు చాలా భారంగా మారింది. కొత్త నటీనటులే కాకుండా, తాజాగా ఎంట్రీ ఇచ్చిన దర్శకులు సైతం అధిక పారితోషికం డిమాండ్ చేస్తున్నారు. నటీనటులకు పరిశ్రమ బాగోగులపై ఏమాత్రం చింత లేకుండా పోయింది," అని ఆరోపించారు.
మరొక ముఖ్యమైన అంశంగా.. గతంలో 50 రోజుల్లో పూర్తయ్యే చిత్రాలు, ప్రస్తుతం 150 రోజులు పాటు షూటింగ్ జరుపుకుంటున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధంగా సినిమాల ఖర్చు పెరిగిపోతోంది, అయితే వచ్చిన పెట్టుబడికి 10% కూడా వెనక్కి వచ్చే పరిస్థితి లేదు.
2024లో విడుదలైన మొత్తం చిత్రాల్లో 176 సినిమాలు భారీ నష్టాలను చవిచూశాయని నివేదికలు చెబుతున్నాయి. ఇక 2025 జనవరిలో మలయాళ పరిశ్రమలో లాభాన్ని తెచ్చిపెట్టిన ఏకైక సినిమా అసిఫ్ అలీ, అనస్వర రాజన్ నటించిన ‘రేఖాచిత్రం’ మాత్రమేనని తెలుస్తోంది.
ఇప్పటికే మలయాళ సినిమా నిర్మాతల సంఘం.. నటీనటుల సంఘానికి హెచ్చరికలు పంపింది. నటీనటుల పారితోషికం తగ్గించాల్సిందేనని, లేదంటే సినిమా నిర్మాణం పూర్తిగా నిలిచిపోతుందని వారు సూచించారు. కానీ ఈ విషయంపై ఎటువంటి చర్చలు జరగలేదు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? లేక పరిశ్రమలో మరింత సంక్షోభం నెలకొంటుందా? అనేది చూడాలి.
-
Home
-
Menu