బీఏ పాఠ్యాంశంలో మమ్ముట్టి జీవిత చరిత్ర

బీఏ పాఠ్యాంశంలో మమ్ముట్టి జీవిత చరిత్ర
X
మమ్ముట్టిని ‘మలయాళ సినిమా చరిత్ర’ అనే మేజర్ ఎలక్టివ్ కోర్సులో చేర్చినట్లు వెల్లడించారు.

మలయాళ సూపర్‌స్టార్, లెజెండరీ నటుడు మమ్ముట్టి జీవితం, ఆయన పెర్సనాలిటీ గురించి ఎర్నాకులంలోని మహారాజా కాలేజీలో నాలుగేళ్ల బీఏ ఆనర్స్ హిస్టరీ కోర్సు సిలబస్‌లో భాగంగా చేర్చారు. అయితే అందులో.. కేవలం మమ్ముట్టి గురించి మాత్రమే కాదు. షెడ్యూల్డ్ కులానికి చెందిన మొట్టమొదటి మలయాళ మహిళగా బ్యాచిలర్ డిగ్రీ సాధించి, భారత రాజ్యాంగ సభలో సభ్యురాలిగా పనిచేసిన దాక్షాయణి వేలాయుధన్ వంటి ఇతర ప్రముఖ వ్యక్తులను కూడా ఈ సవరించిన సిలబస్‌లో జోడించడం విశేషం.

మమ్ముట్టి, దాక్షాయణి ఇద్దరూ మహారాజా కాలేజీ గర్వించదగిన మాజీ విద్యార్థులు కావడం విశేషం. ఇది ఈ నిర్ణయానికి మరింత ప్రాముఖ్యతను జోడిస్తుంది. కాలేజీ హిస్టరీ డిపార్ట్‌మెంట్ హెడ్ జకారియా తంగల్ మాట్లాడుతూ.. మమ్ముట్టిని ‘మలయాళ సినిమా చరిత్ర’ అనే మేజర్ ఎలక్టివ్ కోర్సులో చేర్చినట్లు వెల్లడించారు. ఈ కోర్సును రెండో సంవత్సరం హిస్టరీ స్టూడెంట్స్ ఈ ఏడాది నుంచి చదవనున్నారు. ఈ నిర్ణయం కాలేజీ బోర్డ్ ఆఫ్ స్టడీస్ తీసుకున్నదని, ఇది మలయాళ సినిమా ఇండస్ట్రీపై మమ్ముట్టి చూపిన ప్రభావాన్ని గుర్తించడమే కాక, విద్యార్థులకు స్థానిక సాంస్కృతిక చరిత్రను లోతుగా అర్థం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుందని ఆయన అన్నారు.

దాక్షాయణి వేలాయుధన్ గురించి మాట్లాడుతూ.. ఆమె కులవివక్ష అత్యధికంగా ఉన్న ఒకప్పటి యుగంలో అనేక అడ్డంకులను అధిగమించి తన బ్యాచిలర్ డిగ్రీని సాధించారని జకారియా వివరించారు. ఆమె సాధించిన విజయం, సామాజిక అసమానతలను ఎదుర్కొని ముందుకు సాగిన వైనం ఆమె ధైర్యానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. సవరించిన సిలబస్‌లో ‘తాత్వికులు, సామాజిక సంస్కర్తలు’ అనే సెక్షన్‌లో మరికొందరు ఆసక్తికరమైన వ్యక్తులను చేర్చారు.

Tags

Next Story