నా కొడుకు ఎవరినీ మోసం చేయలేదు: మల్లికా సుకుమారన్

'ఎల్2: ఎంపురాన్' విడుదలైనప్పటి నుంచి అది వివాదాస్పదంగా మారింది. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా.. కొన్ని సన్నివేశాల కారణంగా విమర్శలకు గురైంది. నటుడు మోహన్‌లాల్ ఇప్పటికే దీనిపై క్షమాపణలు చెప్పగా.. తాజాగా దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తల్లి మల్లిక సుకుమారన్ ఈ అంశంపై స్పందించారు. తన కుమారుడు ఎవరినీ మోసం చేయలేదని, అతనిపై వస్తున్న ఆరోపణలు అన్యాయమని ఆమె స్పష్టం చేశారు.
మల్లిక తన సోషల్ మీడియా ఖాతాలో.. "నా కుమారుడు పృథ్వీరాజ్‌ను తప్పుడు కథనాల ద్వారా కించపరచడం బాధాకరం. 'ఎల్2: ఎంపురాన్' సినిమా నిర్మాణం చాలా ముందస్తు జాగ్రత్తల మధ్య జరిగింది. మోహన్‌లాల్, నిర్మాతలు ఎవరూ పృథ్వీరాజ్‌పై తప్పుబట్టలేదు. కానీ కొందరు కావాలనే నా కుమారుడిని బలిపశువుగా చూపిస్తున్నారు. అతను ఎవరినీ మోసం చేయడు, ఎప్పటికీ చేయడు," అని పేర్కొన్నారు.
ఈ వివాదంపై మరింత వివరణ ఇస్తూ.. "సినిమా సృష్టి ఓ సమూహ ప్రక్రియ. ఇందులో పాల్గొన్న ప్రతిఒక్కరూ స్క్రిప్ట్ చదివారు, చిత్రీకరణకు సాక్షిగా ఉన్నారు. రచయిత సహా అనేక మంది డైలాగులు, సన్నివేశాల్లో మార్పులు చేశారు. కానీ, ఇప్పుడు ఒక్క పృథ్వీరాజ్‌నే దీనికి బాధ్యుడిగా చూపడం అన్యాయం. మోహన్‌లాల్‌కు తెలియకుండా కొత్త సన్నివేశాలు జోడించారనే ఆరోపణలు పూర్తిగా అబద్ధం," అని తెలిపారు.
మార్చి 27న విడుదలైన 'ఎల్2: ఎంపురాన్' ఇప్పటికే రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది. అయితే, వివాదాస్పద సన్నివేశాలను దృష్టిలో ఉంచుకొని చిత్రబృందం కొన్ని మార్పులు చేసింది. అందులో భాగంగా 17 సన్నివేశాల్లో మార్పులు జరిగినట్లు సమాచారం. తన కుమారుడు ఈ చిత్రానికి ఎంతో కష్టపడ్డాడని, కానీ అనవసరంగా అతనిపై ఆరోపణలు చేయడం బాధాకరమని మల్లిక అన్నారు. ఈ వివాదంపై చిత్రబృందం ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
-
Home
-
Menu