సౌబిన్ షాహిర్ దుబాయ్ ఎంట్రీకి నిరాకరించిన కోర్ట్

క్రేజీ మలయాళ నటుడు, నిర్మాత సౌబిన్ షాహిర్‌ను కేరళలోని మరడు పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. ఆయన నటించి, నిర్మించిన సూపర్ హిట్ చిత్రం ‘మంజుమ్మల్ బాయ్స్’ తో సంబంధం ఉన్న రూ. 7 కోట్ల ఆర్థిక మోసం కేసులో ఈ అరెస్ట్ జరిగింది. ఈ కేసులో అవినీతి ఆరోపణలపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. సౌబిన్‌తో పాటు ఆయన సహ-నిర్మాతలు బాబు షాహిర్, షాన్ ఆంటోనీలను కూడా అదుపులోకి తీసుకున్నారు.
అయితే వారు తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో సౌబిన్ షాహిర్‌ను యూఏఈ కి వెళ్లకుండా నిషేధించారు. ఈ నెలలో దుబాయ్‌లో సెప్టెంబర్ 5న జరిగే ఒక అవార్డు కార్యక్రమానికి హాజరయ్యేందుకు సౌబిన్ అనుమతి కోరగా... ఎర్నాకులం మెజిస్ట్రేట్ కోర్టు ఆయన ట్రావెల్ అభ్యర్థనను తిరస్కరించింది. జులైలో ఈ కేసు సంబంధంగా ఆయనను మొదటిసారి అరెస్ట్ చేసినప్పటికీ, అదే రోజు ఆయనకు ఆంటిసిపేటరీ బెయిల్ మంజూరై విడుదలయ్యారు. తర్వాత, సౌబిన్ షాహిర్ తన బెయిల్ షరతులను సడలించి విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ కోర్టును ఆశ్రయించారు.
జులైలో మరడు పోలీస్ స్టేషన్‌లో సౌబిన్ షాహిర్ ను విచారించారు. విచారణ తర్వాత, సౌబిన్ మీడియాతో మాట్లాడుతూ.. దర్యాప్తు అధికారులు అడిగిన అన్ని డాక్యుమెంట్లను సమర్పించినట్లు, అవసరమైన తన మొబైల్ ఫోన్‌ను కూడా అందజేసినట్లు చెప్పారు. “దర్యాప్తు అధికారులకు ఇప్పుడు పరిస్థితి అర్థమైందని నేను భావిస్తున్నాను. వారు డాక్యుమెంట్లను సమీక్షించి నిర్ణయం తీసుకుంటారు,” అని ఆయన అన్నారు. సౌబిన్ షాహిర్ తాను అధికారికంగా అరెస్ట్ కాలేదని చెప్పారు. పోలీసు అధికారులు కూడా ఆయనకు కేరళ హైకోర్టు నుంచి షరతులతో కూడిన బెయిల్ మంజూరైందని, అధికారిక అరెస్ట్ జరగలేదని నిర్ధారించారు.
ఈ కేసులో సౌబిన్ తండ్రి బాబు షాహిర్, సహ-నిర్మాత షాన్ ఆంటోనీలను కూడా గతంలో పోలీసులు విచారించారు. ఈ అరెస్ట్‌లు ఇన్వెస్టర్ సిరాజ్ వలియవీట్టిల్ ఫిర్యాదు మేరకు జరిగాయి. సిరాజ్.. చిత్రం లాభాల్లో 40 శాతం వాటా ఇస్తామని వాగ్దానం చేసినప్పటికీ, రూ. 40 కోట్లకు బదులు కేవలం రూ. 5.99 కోట్లు మాత్రమే అందినట్లు ఆరోపించారు. ‘మంజుమ్మల్ బాయ్స్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 240.5 కోట్లు కలెక్ట్ చేసి భారీ విజయం సాధించినప్పటికీ, నిర్మాతలపై ఆర్థిక మోసం ఆరోపణలతో సిరాజ్ ఫిర్యాదు చేశారు.
-
Home
-
Menu