హారర్ కామెడీ "నైట్ రైడర్స్" షూటింగ్ పూర్తి

హారర్ కామెడీ నైట్ రైడర్స్ షూటింగ్ పూర్తి
X

మలయాళ యువ నటుడు మాథ్యూ థామస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న హారర్ కామెడీ "నైట్ రైడర్స్" ప్రధాన చిత్రీకరణను పూర్తిచేసుకుంది. పాలక్కాడ్‌లో జరిగిన ఈ షూటింగ్ ముగిసినట్లు మేకర్స్ మంగళవారం సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. "ఎన్నో రాత్రులు, తెల్లవారుజాముల ఒడిదుడుకుల తర్వాత చివరకు పూర్తయ్యింది.. ఇప్పుడు తదుపరి దశకు సిద్ధం!" అంటూ ఒక పోస్ట్‌లో తెలిపారు.

ఈ చిత్రంతో ఫేమస్ ఎడిటర్ నౌఫల్ అబ్దుల్లా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఆయన గతంలో "అనురాగ కరిక్కిన్ వెళ్ళం," "సుడాని ఫ్రం నైజీరియా," "కెట్ట్యోలాను ఎండే మాలాఖా" వంటి చిత్రాలకు ఎడిటింగ్ అందించారు. మీనాక్షి ఉన్నికృష్ణన్ మాథ్యూ థామస్‌కు జోడీగా నటిస్తోంది. అబూ సలీం, శరత్ సభ, రోషన్ షానవాస్, రోనీ డేవిడ్ రాజ్, జినిల్ జైనుదీన్, నౌషాద్ అలీ, మెరిన్ ఫిలిప్ ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. పాలక్కాడ్‌తో పాటు కోయంబత్తూరులో కూడా చిత్రీకరణ జరిగింది. ఈ చిత్రానికి అభిలాష్ శంకర్ సినిమాటోగ్రఫీ అందించగా, యాక్సన్ గ్యారీ పెరీరా, నేహా ఎస్ నాయర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

"నైట్ రైడర్స్" చిత్రాన్ని నిసార్ బాబు, సజిన్ అలీ ఉల్లాక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. మలయాళంతో పాటు తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా విడుదల కానుంది. ఇదిలా ఉండగా, మాథ్యూ థామస్ తన తదుపరి చిత్రం "లవ్లీ"లో నటిస్తున్నాడు. ఇది దిలీష్ కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన 3D ఫాంటసీ సినిమా. ఈ సినిమా ఏప్రిల్ 4న థియేటర్లలో విడుదల కానుంది.

Tags

Next Story