మలయాళ థ్రిల్లర్ హిందీ వెర్షన్ ను రిలీజ్ చేస్తున్న క్రేజీ డైరెక్టర్

మలయాళ థ్రిల్లర్ "ఫుటేజ్" హిందీ వెర్షన్‌ను ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ప్రెజెంట్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన హిందీ ట్రైలర్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. మలయాళ వెర్షన్ గత ఏడాది ఆగస్టు 23న థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి సైజు శ్రీధరన్ దర్శకత్వం వహించడమే కాకుండా, ఎడిటింగ్ కూడా చేశారు. మంజు వారియర్, విశాక్ నాయర్, గాయత్రి అశోక్ ప్రధాన పాత్రల్లో నటించారు.
ట్రైలర్ చూస్తే... కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఇద్దరు దంపతుల జీవితంలో జరిగిన ఆకస్మిక సంఘటనల ఆధారంగా ఈ సినిమా సాగుతుంది. వాళ్ళు నివసించే అపార్ట్‌మెంట్‌లో కొన్ని రహస్యాలు బయటపడటంతో ఉత్కంఠ మొదలవుతుంది. ఈ చిత్రం ఫౌండ్ ఫుటేజ్ శైలిలో తీశారు. టార్చ్‌లతో అడవిలో అర్థరాత్రి సంచరిస్తూ.. తమ కెమెరాలో రికార్డు అయిన రహస్యమైన దృశ్యాలను వారు అన్వేషిస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ అసలు కథ ఏమిటో ట్రైలర్‌లో పూర్తిగా రివీల్ చేయలేదు. ఇది ఒక రహస్యమయమైన థ్రిల్లర్ అనిపిస్తుంది.
హిందీ పోస్టర్‌ను షేర్ చేస్తూ.. అనురాగ్ కశ్యప్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘కోవిడ్ సమయంలో జరిగిన కథతో రూపొందిన ఒక ఫౌండ్ ఫుటేజ్ థ్రిల్లర్ ఇది. ఈ సినిమాను థియేటర్లో చూశాక, దీన్ని రూపొందించిన విధానం ఆశ్చర్యపరిచింది. రెండు వేర్వేరు దృక్కోణాల నుంచి చిత్రాన్ని మలిచారు. సైజు శ్రీధరన్, అతని టీమ్ అద్భుతమైన పనితనం చూపించారు. ఇక మంజు వారియర్, వైశాఖ్ నాయర్, గాయత్రి అశోకన్ తమ నటనతో సినిమాకు మరో స్థాయిని తీసుకువెళ్ళారు. హిందీ ప్రేక్షకులకు ఈ థ్రిల్లింగ్ అనుభూతిని అందించడం చాలా ఆనందంగా ఉంది’ అన్నారు.
-
Home
-
Menu