‘కనుపాప’ నిర్మాత కు నష్టపరిహారం విధించిన కోర్ట్

ప్రియదర్శన్ దర్శకత్వంలో.. ఆంటోని పెరుంబావూర్ నిర్మాణంలో.. మోహన్‌లాల్ నటించిన ‘ఒప్పం’ ( తెలుగులో ‘కనుపాప’) మలయాళం సినిమాలో అనుమతిలేకుండా తన ఫోటో ఉపయోగించారని కొడుంగల్లూర్ అస్మాబీ కళాశాల అధ్యాపకురాలు ప్రిన్సీ ఫ్రాన్సిస్ కోర్టును ఆశ్రయించింది. చాలక్కుడి మున్సిఫ్ కోర్టు ఆమెకు న్యాయం చేస్తూ.. రూ.1 లక్ష నష్టపరిహారం, కోర్టు ఖర్చుల నిమిత్తం రూ.1.68 లక్షలు చెల్లించాలని తీర్పు వెలువరించింది.
‘ఒప్పం’ సినిమాలో 29 వ నిమిషంలో లేడీ పోలీస్ అనుశ్రీ.. మరో అధికారికి పోలీస్ క్రైం ఫైల్ చూపించేటప్పుడు.. క్రూరంగా హత్యకు గురైన యువతిగా ప్రిన్సీ ఫ్రాన్సిస్ ఫోటోను చూపించారు. తన అనుమతి లేకుండా ఆమె బ్లాగ్ నుంచి ఆ ఫోటో తీసుకున్నారని ఆమె కోర్టులో వాదించింది. ఈ ఘటన తన మానసిక శాంతిని భంగపరిచిందని ఆమె పేర్కొంది. 2017లో కోర్టును ఆశ్రయించిన ఆమె, ఎనిమిదేళ్ల పాటు ఈ కేసు కోసం పోరాడింది.
కోర్టులో చిత్రబృందం ప్రతివాదంగా "ఆ ఫోటో ఆమెది కాదు" అని వాదించింది. అయితే.. బాధితురాలు ఫోటోను తీసివేయాలని కోరినప్పటికీ.. చిత్రబృందం అలా చేయడానికి నిరాకరించింది. ఇప్పటికీ ఆ ఫోటోను సినిమా నుండి తొలగించలేదని ఆమె తెలిపింది.
తన వంటి సాధారణ మహిళలకు న్యాయం జరగాలని భావించి కోర్టును ఆశ్రయించినట్లు ప్రిన్సీ ఫ్రాన్సిస్ మీడియా సమావేశంలో తెలిపింది. ఈ తీర్పుతో ఆమెకు న్యాయం లభించిందని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని ఆశాభావం వ్యక్తం చేసింది.
-
Home
-
Menu