క్యాన్సర్ బాధితుల్లో ధైర్యాన్ని నింపబోతున్న శివరాజ్ కుమార్

క్యాన్సర్ బాధితుల్లో ధైర్యాన్ని నింపబోతున్న శివరాజ్ కుమార్
X

క్యాన్సర్ అనేది మానవాళిని పట్టిపీడిస్తున్న మహమ్మారి. వైద్య రంగం ఎంత పురోగతి సాధించినా, ఇంకా దీనికి శాశ్వత పరిష్కారం దొరకలేదు. అయితే, ధైర్యంతో పోరాడి తిరిగి జీవితాన్ని నిర్మించుకున్నవారెందరో ఉన్నారు. క్రికెటర్ యువరాజ్ సింగ్, ప్రముఖ నటి మనిషా కొయిరాలా, సోనాలి బెంద్రే, లీసారే వంటి సెలబ్రిటీలు క్యాన్సర్‌ను జయించి మళ్లీ మామూలు జీవితాన్ని కొనసాగించారు. కానీ, సరైన అవగాహన లేకపోవడం, సమయానికి చికిత్స అందకపోవడం వల్ల ఎంతోమంది తమ ప్రాణాలు కోల్పోయారు. క్యాన్సర్ బాధితుల్లో ధైర్యాన్ని పెంపొందించేందుకు ప్రముఖ కన్నడ నటుడు శివరాజ్ కుమార్ తన అనుభవాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నారు.

శివరాజ్ కుమార్ ఇటీవలే క్యాన్సర్‌ను జయించారు. గత ఏడాది క్యాన్సర్ బారిన పడిన ఆయన చికిత్స కోసం అమెరికా వెళ్లి, విజయవంతంగా కోలుకుని స్వదేశానికి తిరిగొచ్చారు. కీమోథెరపీ సమయంలో తన జుట్టు రాలలేదని, ప్రజల ఆశీర్వాదంతో కొత్త జీవితం దక్కిందని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. తన అనుభవాలను ఓ డాక్యుమెంటరీగా రూపొందించి విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. దీని ద్వారా క్యాన్సర్ బాధితులకు నూతనోత్సాహాన్ని అందించాలనుకుంటున్నారు.

ఆరు పదుల వయసులో అటువంటి మహామ్మారిని ఎదుర్కొని, దాన్ని అధిగమించడం చిన్న విషయం కాదు. పైగా, కోలుకున్న వెంటనే విశ్రాంతి తీసుకోకుండా సినిమాల షూటింగ్‌లలో తిరిగి ప్రవేశించడం ఆయన మనోధైర్యాన్ని చూపిస్తుంది. ప్రస్తుతం శివరాజ్ కుమార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘RC 16’లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన లుక్ టెస్ట్‌లో దర్శకుడు బుచ్చిబాబు సంతోషం వ్యక్తం చేసినట్లు సమాచారం. ‘జైలర్’లో నరసింహ పాత్ర ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన శివరాజ్ కుమార్, ఈసారి పూర్తి స్థాయిలో తెలుగు డైలాగులు చెబుతూ నటించడం అభిమానులను ఉత్సాహపరుస్తోంది.

Tags

Next Story