‘కాంతార: చాప్టర్ 1’ చిత్ర బృందానికి ప్రభుత్వం హెచ్చరిక!

‘కాంతార: చాప్టర్ 1’  చిత్ర బృందానికి ప్రభుత్వం హెచ్చరిక!
X
గవిబెట్ట సమీపంలో షూటింగ్ చేస్తుండగా.. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించినట్లు ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి.

అన్ని భాషల్లో ఘన విజయాన్ని సాధించిన 'కాంతార' చిత్రానికి సీక్వెల్ గా రూపొందుతున్న 'కాంతార చాప్టర్ 1’ ప్రస్తుతం వివాదాల్లో చిక్కుకుంది. ఈ చిత్ర దర్శకుడు, హీరో రిషబ్ శెట్టి హాసన్ జిల్లా గవిబెట్ట సమీపంలో షూటింగ్ చేస్తుండగా.. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించినట్లు ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి. హోంబలె ఫిల్మ్స్‌ ఈ చిత్ర షూటింగ్‌కు 23 రోజుల పాటు అనుమతి పొందింది. అయితే, షూటింగ్‌లో పేలుడు పదార్థాలు ఉపయోగించి వన్యప్రాణులను కలవరపెడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలపై విచారణ చేపట్టాల్సిందిగా అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి ఖండ్రే అధికారులను ఆదేశించారు.

విధానసౌధలో విలేకరులతో మాట్లాడిన ఖండ్రే, "షరతులను ఉల్లంఘించినట్లు తేలితే, షూటింగ్‌ తక్షణమే ఆపుతాం. పర్యావరణాన్ని కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకుంటాం," అని స్పష్టం చేశారు. గవిబెట్ట, హేరూర్ గ్రామాల్లోని ప్రజలు రిషబ్ శెట్టి బృందంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రక్షిత అటవీ ప్రాంతాల్లోకి ప్రవేశించి, పేలుడు పదార్థాలతో షూటింగ్ నిర్వహించడం పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని వారు అంటున్నారు. "ఇప్పటికే అడవి ఏనుగుల దాడులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుల పరిస్థితి మరింత విషమించవచ్చు," అని ఒక గ్రామస్థుడు సోషల్ మీడియాలో హెచ్చరిక వీడియో ద్వారా పేర్కొన్నారు.

అటవీ, పర్యావరణ, జీవశాస్త్ర శాఖ అదనపు కార్యదర్శి చిత్రీకరణ ప్రాంతాన్ని పరిశీలించాలని ఆదేశించబడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తూ అడవులు, వన్యప్రాణాలను రక్షించాల్సిన అవసరాన్ని మంత్రి ఖండించారు. ఈ వివాదంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. గ్రామస్థుల వీడియో వైరల్ కావడంతో, హాసన్ జిల్లా గ్రామాలు పర్యావరణ పరిరక్షణకు అవసరమైన చర్యల కోసం దృష్టి సారించాయి. 'కాంతార చాప్టర్ 1' చిత్ర బృందం పర్యావరణ నిబంధనలు పాటిస్తూ, అందరి అభ్యంతరాలను సమర్థంగా పరిష్కరించగలదా లేదా అనేది వేచిచూడాల్సి ఉంది.

Tags

Next Story