రష్మిక మందన్నను లక్ష్యంగా చేసుకుంటున్న విమర్శలు

రష్మిక మందన్నను లక్ష్యంగా చేసుకుంటున్న విమర్శలు
X

భారతీయ చిత్రసీమలో అత్యంత ప్రాధాన్యత పొందిన నాయికలలో రష్మిక మందన్న ఒకరు. ఆమె నటించిన పుష్ప 2, యానిమల్, తాజాగా ‘చావ’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు ఈ విషయాన్ని మరింత స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అయితే, వ్యక్తిగత జీవితం కారణంగా కన్నడ సినీ ప్రేక్షకుల నుంచి ఆమెకు ఎదురైన వ్యతిరేకత ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

తాజాగా, ఈ వివాదం మరింత ముదిరినట్లు కనిపిస్తోంది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి కుమార్ ఇటీవల రష్మికపై విమర్శలు గుప్పించారు. "రష్మిక మందన్న తన కెరీర్‌ను కిరిక్ పార్టీ సినిమాతో ప్రారంభించింది. కానీ, గతేడాది కర్ణాటక అంతర్జాతీయ సినీమహోత్సవానికి ఆమెను ఆహ్వానించినప్పుడు రావడానికి నిరాకరించింది. ‘నా ఇల్లు హైదరాబాద్‌లో ఉంది, నాకు కర్ణాటక ఎక్కడుందో తెలియదు, నాకు సమయం లేదు, నేను రాలేను’ అని చెప్పిందట. మా ఎమ్మెల్యే స్నేహితుడు దాదాపు 10-12 సార్లు ఆమె ఇంటికి వెళ్లి ఆహ్వానించాడని, అయినా అంగీకరించలేదని అన్నారు. కన్నడ పరిశ్రమలో ఎదిగిన ఆమె కన్నడను ఇలా నిర్లక్ష్యం చేయడం సరైనదా? వీరికి బుద్ధి చెప్పకూడదా?" అని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.

ఇదే సమయంలో, రష్మిక అభిమానులు ఈ వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. వ్యక్తిగత కారణాలతో ఒక కార్యక్రమానికి హాజరుకాలేనని చెప్పడం ఆమె హక్కు అని వారు అంటున్నారు. గతంలో సోషల్ మీడియాలో రష్మికపై కొన్ని కన్నడ అభిమానులు తీవ్రమైన ట్రోలింగ్ నిర్వహించినప్పుడు, ప్రభుత్వం మాత్రం స్పందించలేదని ఇప్పుడు విమర్శిస్తున్నారు. అయితే, ఆమె విజయాల పర్వంలో ఉన్న సమయంలో మాత్రం ఆమెను తమ కార్యక్రమాలకు ఆహ్వానించి, హాజరు కాలేదని విమర్శించడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్న రష్మిక అభిమానుల నుంచి వ్యక్తమవుతోంది. ఈ వివాదం ఎంతవరకు సాగుతుందో చూడాలి, కానీ వ్యక్తిగత నిర్ణయాలను గౌరవించాల్సిన అవసరం ఉందని సినీ పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Tags

Next Story