‘కూలీ’ టికెట్ రేట్ 2వేలు.. ఎక్కడంటే?

‘కూలీ’ టికెట్ రేట్ 2వేలు.. ఎక్కడంటే?
X
తమిళనాడులో ఆగస్టు 14, 2025న ఈ సినిమాను ఒక్క సీటుకు రూ. 200 లోపే చూడగలుగుతుండగా.. కర్ణాటకలో మాత్రం తెల్లవారు జామున షోలకు టికెట్ ధరలు షాకింగ్ గా ఉన్నాయి.

బెంగళూరులో సినిమా టికెట్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయనే ఫిర్యాదు మళ్లీ తెరపైకి వచ్చింది. అందులోనూ రజనీకాంత్ లాంటి సూపర్‌స్టార్ నటిస్తున్న ‘కూలీ’ సినిమ విషయంలో. తమిళనాడులో ఆగస్టు 14, 2025న ఈ సినిమాను ఒక్క సీటుకు రూ. 200 లోపే చూడగలుగుతుండగా.. కర్ణాటకలో మాత్రం తెల్లవారు జామున షోలకు టికెట్ ధరలు షాకింగ్ గా ఉన్నాయి. ఆగస్టు 9న అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయిన కొద్దిసేపట్లోనే ‘కూలీ’ సినిమా హైప్‌ను సృష్టించడమే కాక, రికార్డులను తిరగరాసింది.

కేవలం అరగంటలో 66 షోలకు సుమారు 10,000 టికెట్లు అమ్ముడై.. బెంగళూరులో అత్యంత వేగంగా ఈ రికార్డు సాధించిన సినిమాగా నిలిచింది. అయితే... కర్ణాటకలో అభిమానులు మాట్లాడుకున్నది టికెట్ సేల్స్ గురించి మాత్రమే కాదు. యం.జీ రోడ్‌లోని స్వాగత్ శంకర్ నాగ్ థియేటర్‌లో తెల్లవారు జాము 6, 7 గంటల షోలకు గోల్డ్ రిక్లైనర్ సీట్లు రూ. 2,000, గోల్డ్ సీట్లు రూ. 1,500, సిల్వర్/లాంజ్ సీట్లు రూ. 1,000 ధరలతో లభ్యమయ్యాయి. తవేరెకెరెలోని లక్ష్మీ సినిమాస్‌లో డైమండ్ క్లాస్ టికెట్ రూ. 1,000, గోల్డ్ క్లాస్ రూ. 800గా ఉన్నాయి.

నగరంలోని చాలా ఎర్లిమార్నింగ్, ఉదయం షోలకు టికెట్ ధరలు సగటున రూ.400, రూ. 500గా ఉన్నాయి. అయితే త్వరలో మరిన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లు రూ. 1,000 ధరను అనుసరించే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో ఈ ధరలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. చాలామంది తమిళనాడులోని మాయాజాల్ వంటి మల్టీప్లెక్స్‌లలో కూడా ధరలు నియంత్రణలో ఉండటాన్ని పోల్చి చూపారు. బెంగళూరు మాత్రం సినిమా చూడటానికి అత్యంత ఖరీదైన నగరంగా కొనసాగుతోంది.

రజనీకాంత్‌తో పాటు కూలీలో ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, శృతి హాసన్, సత్యరాజ్, నాగార్జున, అమీర్ ఖాన్ వంటి స్టార్ కాస్ట్ ఉన్నారు. రచిత రామ్, రెబా మోనికా జాన్, జూనియర్ యంజీఆర్, కన్నా రవి, మోనిషా బ్లెస్సీ, కాళీ వెంకట్, చార్లె ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు.

Tags

Next Story