ఆసక్తికరంగా 'కాంత' టీజర్

పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసే నటులు అరుదుగా ఉంటారు. అలాంటి కోవకు చెందిన నటుడు దుల్కర్ సల్మాన్. 'మహానటి' వంటి సూపర్ హిట్ తర్వాత దుల్కర్ మళ్లీ సినిమా బ్యాక్ డ్రాప్ లో నటిస్తున్న చిత్రం 'కాంత'. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే, సముద్రఖని ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈరోజు దుల్కర్ బర్త్‌డే స్పెషల్ గా 'కాంత' నుంచి టీజర్ వచ్చింది. కథ 1950ల మద్రాస్ నేపథ్యంలో సాగుతుంది. ఓ స్టార్ హీరో (దుల్కర్) మరియు వెటరన్ డైరెక్టర్ (సముద్రఖని) మధ్య స్నేహం, ఆపై వచ్చిన విభేదాల చుట్టూ సినిమా కథ తిరుగుతుంది. ఈ ఇద్దరూ కలిసి 'శాంత' అనే హారర్ సినిమాను తెరకెక్కిస్తుంటారు. కానీ ఆ సినిమా విషయంలో ఇద్దరికీ విబేధాలు తలెత్తి టైటిల్‌నే ‘కాంత’గా మార్చే పరిణామాల దాకా వెళ్లడం ఆసక్తిని రేపుతోంది.
టీజర్‌లోని ప్రెజెంటేషన్, నేరేషన్ స్టైల్ ఆకట్టుకుంటున్నాయి. దుల్కర్ సల్మాన్ మరోసారి తన వింటేజ్ లుక్, నేచురల్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంటున్నాడు. తెలుగుతో పాటు తమిళంలోనూ రూపొందుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 12న థియేటర్లలోకి రాబోతుంది.
-
Home
-
Menu