తెలుగు చిత్రపరిశ్రమలో హారర్ జోరు!

ఇటీవల కాలంలో ప్రేక్షకులు హారర్ సినిమాల పట్ల ఆసక్తిని పెంచుకుంటున్నారు. థ్రిల్లింగ్ హారర్ స్టోరీలే కాదు, కామెడీ, ఎమోషన్, యాక్షన్ వంటి అంశాలతో మేళవించిన హారర్ కథాంశాలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో, టాలీవుడ్‌లో వరుసగా హారర్ సినిమాలు రాబోతున్నాయి.
రెబెల్ స్టార్ ప్రభాస్ తొలిసారి హారర్ జానర్ లో నటిస్తున్న సినిమా 'రాజా సాబ్'. హారర్, కామెడీ, ఎమోషన్స్ కలబోసి ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాడు డైరెక్టర్ మారుతి. ఈ చిత్రంలో మూడు తరాల ఆత్మలు కథలో కీలకంగా మారతాయట. ప్రభాస్ తండ్రీకొడులుగా నటిస్తుండగా.. తాత పాత్రలో సంజయ్ దత్ కనిపించనున్నాడట. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రం అసలు ఈ ఏప్రిల్ లోనే రావాల్సి ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యమవుతుండడంతో ఈ చిత్రం విడుదల ఇంకా ఆలస్యమయ్యే అవకాశం ఉంది.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ డిఫరెంట్ హారర్ మూవీ రూపొందుతుంది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో, కొరియన్ స్పిరిట్ (భూతం) మిళితమైన వినూత్నమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ‘కొరియన్ కనకరాజు‘ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఆమధ్య ఈ చిత్రంకోసం వియత్నాంలో స్టోరీ డిస్కషన్స్ తో పాటు పనిలో పనిగా లొకేషన్స్ హంటింగ్ కూడా చేశారు. ఈ చిత్రాన్ని యు.వి.క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
కామెడీలో దుమ్మురేపే అల్లరి నరేష్, ఇటీవలి కాలంలో వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ కొత్త దారిలో ప్రయాణం చేస్తున్నాడు. ఈకోవలోనే 'పొలిమేర' ఫ్రాంచైజీ మేకర్స్ ఆధ్వర్యంలో రూపొందుతున్న ‘12A రైల్వే కాలనీ’ అనే హారర్ థ్రిల్లర్‌లో నటిస్తున్నాడు. ఓ మిస్టరీ కథాంశంతో రాబోతున్న ఈ మూవీలో అల్లరి నరేష్ లుక్ ఎంతగానో భయపెడుతుందట. ఈ సినిమాలో కామాక్షి భాస్కర్ల హీరోయిన్‌గా నటిస్తుండగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
యంగ్ హీరో సుశాంత్ ఇప్పుడు తన కెరీర్‌లో పూర్తి కొత్త జానర్‌ను ఎంచుకుని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘యస్ ఏ 10’ పేరుతో రూపుదిద్దుకుంటున్న ఈ హారర్ థ్రిల్లర్ చిత్రానికి పృధ్విరాజ్ చిట్టేటి దర్శకత్వం వహిస్తున్నారు. లేటెస్ట్‌గా రిలీజైన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచింది. మొత్తంగా ఈ హీరోలందరికీ హారర్ జానర్ కొత్తే. మరి.. వీరిలో ఏ ఏ హీరోలు హారర్ స్టోరీస్ తో హిట్ కొడతారో చూడాలి.
-
Home
-
Menu