ఈ కోలీవుడ్ హీరో రూటు మారుస్తున్నాడట !

కోలీవుడ్ హీరో జయం రవి తన కెరీర్‌లో కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నాడు. అతని గత కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాలను చవిచూశాయి. అయితే, శివ కార్తికేయన్, సుధా కొంగర కాంబినేషన్‌లో వస్తున్న "పరాశక్తి" చిత్రంలో విలన్ గా నటిస్తూ తిరిగి ఫామ్‌లోకి రావాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం.. జయం రవి త్వరలో దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నాడట. పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమాకు జయం రవి దర్శకత్వం వహించనున్నట్లు ప్రచారం సాగుతోంది.
మరింత ఆసక్తికరంగా.. ప్రముఖ కమెడియన్ యోగిబాబు ఈ చిత్రానికి హీరోగా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం "పరాశక్తి", "కరాటే బాబు" అనే రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రాలు రవి చేతిలో ఉన్నాయి. ఈ రెండు సినిమాలను పూర్తిచేసిన తరువాతే తన దర్శకుడిగా మారే ప్రాజెక్ట్‌పై పూర్తి స్థాయిలో పనిచేయనున్నాడని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఇది కేవలం ఒకసారి చేసే ప్రయోగమా? లేక జయం రవి దర్శకుడిగా కొనసాగుతాడా? అన్నది ఆసక్తికరమైన ప్రశ్న.
రవి దర్శకత్వం వహించే సినిమా గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇది నిజంగా హాస్యభరితమైన ఎంటర్‌టైనర్ అయితే, ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని కలిగించనుంది. మరి, "జయం" రవి నటనతోనే కాదు, దర్శకత్వంతోనూ "జయం" అందుకోగలడా?" వేచి చూడాలి!
-
Home
-
Menu