తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పిన పూజా హెగ్డే !

తమిళ స్టార్ హీరో సూర్య, కార్తిక్ సుబ్బరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘రెట్రో’. ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఇందులో ఆమె తన పాత్రకు స్వయంగా తనే డబ్బింగ్ చెబుతుండడం విశేషం. సెట్‌స్ పై జరిగిన వినోదాత్మక, చిరస్మరణీయ సంఘటనలను కామిక్ స్ట్రిప్‌లుగా విడుదల చేస్తున్న స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, తాజాగా ఐదో ఎపిసోడ్ ‘వాళ తమిళ్! ఛాలెంజ్ యాక్సెప్టెడ్ ! పూజా హెగ్డే డబ్స్ ఫర్ హెర్ సెల్ఫ్’ ను విడుదల చేసింది.
ఈ సందర్భంగా చిత్రబృందం.. కథానాయిక ఎంపిక ఎలా జరిగిందో ఆసక్తికరంగా వెల్లడించింది. దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ కథానాయిక కోసం అనేక పేర్లను పరిశీలించారు. అయితే పూజా హెగ్డే ను చూసిన వెంటనే, ‘ఈమే మనం వెతుకుతున్న అమ్మాయి’ అని ఫిక్స్ చేశారని.. అని నిర్మాణ సంస్థ తెలిపింది. కానీ తమిళం లోకల్ యాసలో డైలాగ్స్ చెప్పగలదా? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. అయితే చిన్నతనం నుండి సవాళ్లను స్వీకరించే పూజా.. నేను ఖచ్చితంగా సాధిస్తాను.. అని ధైర్యంగా చెప్పిందట.
లుక్ టెస్ట్ పూర్తయ్యాక, పూజా రోజూ తమిళ ట్రైనింగ్ తీసుకోవడం మొదలు పెట్టింది. అలా కొద్దిరోజులకే పెద్దపెద్ద డైలాగ్‌లను అద్భుతంగా చెప్పి అందరికీ ఆశ్చర్యం కలిగించింది. షూటింగ్ సమయంలో పూజా తడబడేలా చేయాలని టీమ్ ప్రయత్నించిందట. క్లిష్టమైన తమిళ పదాలతో మభ్యపెట్టినా, ఆమె ధైర్యంగా అవన్నీ నేర్చుకుని అందరికీ షాక్ ఇచ్చింది. పూజా అద్భుతంగా తమిళంలో తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పిందని రెట్రో టీమ్ వెల్లడించింది. ఈ చిత్రంలో ఇంకా మలయాళ నటులు జోజు జార్జ్, జయరాం, తమిళ నటుడు కరుణాకరన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
-
Home
-
Menu