ఆసుపత్రిలో చేరిన ఏఆర్ రెహమాన్ !

ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ ఆదివారం తెల్లవారు ఝామున ఆసుపత్రిలో చేరారు. 58 ఏళ్ల ఈ ఆస్కార్ అవార్డు విజేత, మ్యూజిక్ కంపోజర్ ఛాతీ, మెడ నొప్పితో బాధపడుతూ ఉండటంతో ఆయన కుటుంబ సభ్యులు వెంటనే చెన్నై అపోలో ఆసుపత్రికి తరలించారు.
రెహ్మాన్‌కు చికిత్స అందిస్తున్న వైద్యులు కొన్ని పరీక్షలు నిర్వహించారు. ఆయనకు త్వరలో యాంజియోగ్రామ్ చేసే అవకాశముంది. అయితే, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రెహ్మాన్ త్వరలోనే డిశ్చార్జ్ అవుతారని సమాచారం. ఇటీవలే విదేశీ పర్యటన ముగించుకుని ఆయన తిరిగి వచ్చారు. రెహ్మాన్ ఆరోగ్యంపై అపోలో ఆసుపత్రి వైద్యులు అధికారిక ప్రకటన విడుదల చేయనున్నారు.
ఈ వార్త తెలిసిన వెంటనే రెహ్మాన్ అభిమానులు, సినీ పరిశ్రమ ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా ద్వారా ప్రార్థనలు చేస్తున్నారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే.. రెహ్మాన్ మాజీ భార్య సైరా బాను కొన్ని నెలల క్రితం శస్త్రచికిత్స చేయించుకున్నారు. గత ఏడాది నవంబర్‌లో 29 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలికిన రెహ్మాన్, సైరా బాను శస్త్రచికిత్స సమయంలో ఆయన మద్దతుగా నిలిచినందుకు ఆమె ధన్యవాదాలు తెలిపిన నేపథ్యంలో, వీరిద్దరూ మళ్లీ కలిసే అవకాశముందని వార్తలు చక్కర్లు కొట్టాయి.
ఇటీవల రెహ్మాన్ కంపోజ్ చేసిన ఛావా, తమిళ చిత్రం కాదలిక్క నేరమిల్లై ఆల్బమ్‌లకు మంచి స్పందన లభించింది. రామ్ చరణ్ ఆర్సీ16, మణిరత్నం-కమల్ హాసన్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘థగ్ లైఫ్’ చిత్రాలకు కూడా ఆయన సంగీతం అందిస్తున్నారు.
-
Home
-
Menu