నటుడిగా లోకేశ్ కనగరాజ్ ?

తమిళ సినీ పరిశ్రమలో దర్శకులు నటుడిగా మారడం ఇప్పుడు ఆశ్చర్యం కలిగించే విషయం కాదు. 'లవ్ టుడే'తో భారీ విజయం సాధించిన ప్రదీప్ రంగనాథన్ తర్వాత, ఇప్పుడు అదే దారిలో అడుగుపెడుతున్నాడు లోకేష్ కనగరాజ్. 'ఖైదీ', 'మాస్టర్', 'విక్రమ్' లాంటి ఘాటు హిట్‌లను అందించిన ఈ డైరెక్టర్.. ఇప్పుడు కెమేరా వెనుక వైపు కాకుండా.. కెమేరా ఎదురుగా రాబోతుండడం విశేషం.
కొలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. 'క్యాప్టెన్ మిల్లర్' దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో లోకేష్ కనగరాజ్ తన తొలి నటన ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాడు. కథా చర్చలు పూర్తయ్యాయని, ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించబోతుందని సమాచారం. అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. ఇదిలా ఉండగా, రజనీకాంత్ నటిస్తున్న 'కూలీ' ఆగస్టు 14న విడుదలకు సిద్ధమవుతుండగా, లోకేష్ నటనలోకి అడుగుపెడతారన్న వార్త కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది.
నిజానికి లోకేష్‌కు కెమెరా ముందు నిలబడే అనుభవం ఇదే తొలిసారి కాదు. శృతిహాసన్‌తో కలిసి నటించిన 'ఇనిమేల్' మ్యూజిక్ వీడియోలో ఆయన కనిపించారు. కమల్ హాసన్ సంస్థ నిర్మించిన ఆ వీడియో యూట్యూబ్‌లో 1.4 కోట్ల వ్యూస్‌ను క్రాస్ చేసింది. ఆ చిన్న ప్రయోగమే ఈ పెద్ద అడుగు వెనక స్ఫూర్తిగా నిలిచిందేమో!
ఇప్పటికే డైరెక్టర్‌గా తనదైన శైలిని నిలబెట్టుకున్న లోకేష్ కనగరాజ్, ఇప్పుడు నటుడిగా కొత్త ప్రయాణం మొదలుపెడుతున్నాడు. ఇది అతడి జీవితంలో మరో బ్లాక్‌బస్టర్ చేంజ్ అవుతుందా? కాలమే తెలియజేస్తుంది. కానీ ఇప్పటికి మాత్రం... ఆయన జీవిత కథలో కొత్త చాప్టర్ మొదలైపోయిందని మాత్రం నిజం.
-
Home
-
Menu