కార్తికి గాయాలు.. ‘సర్దార్ 2’ షూటింగ్ వాయిదా

కార్తికి గాయాలు.. ‘సర్దార్ 2’ షూటింగ్ వాయిదా
X

తమిళ హీరో కార్తి తన అప్ కమింగ్ మూవీ ‘సర్దార్ 2’ షూటింగ్ సమయంలో కాలికి గాయమైంది. మైసూర్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వెంటనే ఆయన్ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు, అక్కడ వైద్యులు గాయాల తీవ్రతను పరిశీలించారు. సమాచారం ప్రకారం, కార్తికి ఒక వారం విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.

డాక్టర్ల సూచన మేరకు ‘సర్దార్ 2’ చిత్ర బృందం షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసి చెన్నైకి తిరిగివచ్చింది. కార్తి పూర్తిగా కోలుకున్న తర్వాత చిత్రీకరణను తిరిగి ప్రారంభించనున్నారు. ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తయిందని సమాచారం. త్వరలోనే నిర్మాతలు, కార్తి అనుమతి పొందిన తర్వాత మిగిలిన భాగాన్ని చిత్రీకరించనున్నారు.

ఇటీవల, చెన్నైలోని ఒక పెద్ద స్టూడియోలో చిత్ర బృందం క్లైమాక్స్ సన్నివేశాలను గ్రాండ్‌గా షూట్ చేసింది. ఈ షెడ్యూల్‌లో కార్తి, ఎస్.జె.సూర్య పాల్గొన్నారు. ‘ఆవేశం’ చిత్రానికి స్టంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన చేతన్ రంశి డిసౌజా, ఈ చిత్రంలో కార్తి, ఎస్.జె.సూర్యలపై హై యాక్టేన్ యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేశారు.

పి.ఎస్. మిత్రన్ దర్శకత్వం వహిస్తున్న ‘సర్దార్ 2’లో కార్తి ద్విపాత్రాభినయం చేస్తున్నారు. కథ రెండు విభిన్న కాలాల్లో సాగనుందని సమాచారం. 2024 మధ్యలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లింది. మరో రెండు వారాల్లో షూటింగ్ పూర్తి చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. కార్తి, రజిషా విజయన్ తమ పాత్రలను తిరిగి పోషించనుండగా, ఎస్.జె.సూర్య, మాళవిక మోహనన్, ఆశికా రంగనాథ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తుండగా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

Tags

Next Story