జి.వి.ప్రకాశ్ సంగీతం అందిస్తున్న సూర్య ‘వాడివాసల్’
వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘వాడివాసల్’ తమిళ చిత్రానికి సంబంధించిన పనులు వేగం అందుకున్నాయి. మాస్ హీరో సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న భారీ బడ్జెట్ చిత్రం కావడంతో అభిమానుల్లో అంచనాలు తారా స్థాయికి చేరాయి. 2017లో మధురైలో జల్లికట్టు నిషేధాన్ని తొలగించాలని తమిళ ప్రజలు చేపట్టిన ఉద్యమం తమిళనాడు వ్యాప్తంగా విస్తరించింది. ముఖ్యంగా చెన్నై మెరీనా బీచ్‌లో లక్షలాదిమంది ప్రజలు ఏకతాటిపై చేరి నిరసన వ్యక్తం చేయడం చరిత్రలో నిలిచిపోయే సంఘటనగా మారింది. జల్లికట్టు ఉద్యమం ప్రజా వ్యతిరేక విధానాలకు గట్టి సమాధానంగా నిలిచింది.
సమాజంలో ఉత్పన్నమయ్యే సమస్యలను తన సినిమాల్లో ప్రభావవంతంగా చూపించడంలో వెట్రిమారన్ దిట్ట. ఆయన తెరకెక్కించబోయే ‘వాడివాసల్’ సినిమాలో జల్లికట్టు ఉద్యమానికి, ఆ సంస్కృతికి ఎలా న్యాయం చేస్తారనే దానిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన ఓ వీడియోను విడుదల చేయగానే.. ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో పెరిగింది.
‘వాడివాసల్’ సినిమా ప్రారంభం ఆలస్యమవ్వడంపై అభిమానుల్లో మిశ్రమ భావనలు వ్యక్తమయ్యాయి. వెట్రిమారన్, సూర్య కలిసి కనిపించిన ప్రతిసారీ ‘వాడివాసల్’ గురించి ప్రశ్నలు వెల్లువెత్తాయి. ఈ లోగా లండన్‌లో చిత్రానికి సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ జరుగుతుందనే వార్తలు వినిపించాయి. అంతేకాదు, సూర్య ఈ చిత్రంలో నటించేందుకు తన ఇంట్లో ఓ దున్నపోతును పెంచుతూ ప్రాక్టీస్ చేస్తున్నారని కథనాలు వచ్చాయి. ప్రస్తుతం సూర్య కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ‘రెట్రో’ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తయ్యాక ‘వాడివాసల్’ షూటింగ్ ప్రారంభమవుతుందని సమాచారం.
ఇటీవల సంగీత దర్శకుడు జి.వి.ప్రకాశ్ తన ఎక్స్ ఖాతాలో ‘వాడివాసల్’ చిత్రానికి సంగీతం ప్రారంభమైనట్లు ప్రకటించారు. ‘‘ఇది ఒక మెగా బడ్జెట్ పీరియడ్ ఫిల్మ్’’ అంటూ పేర్కొన్నారు. వెట్రిమారన్, జి.వి.ప్రకాశ్ కలయికలో వచ్చిన ‘అసురన్’ భారీ విజయాన్ని సాధించడంతో ‘వాడివాసల్’ పాటలపై మరింత ఆసక్తి నెలకొంది.
-
Home
-
Menu