‘మదగజరాజా’ ఎఫెక్ట్.. విడుదల కానున్న మరిన్ని చిత్రాలు

‘మదగజరాజా’ చిత్రం ఘనవిజయం సాధించిన తరువాత.. విక్రమ్, గౌతమ్ మీనన్ కాంబో మూవీ ‘ధ్రువ నక్షత్రం’ సహా పలు చిత్రాలు విడుదలకు సిద్ధమ వుతున్నాయి. సుందర్.సి దర్శకత్వంలో, విశాల్ హీరోగా, 2013లో రూపొందిన చిత్రం ‘మదగజరాజా’. ఈ చిత్రంలో విశాల్‌తో పాటు, సంతానం, అంజలి, వరలక్ష్మీ, నితిన్ సత్య, సోనూ సూద్, మాజీ క్రికెటర్ సడగోపన్ రమేశ్, మరణించిన నటులు మనివన్నన్, మనోబాల, మయిల్సామి, చిన్నిపాబు తదితరులు నటించారు.
ఈ చిత్రానికి విజయ్ ఆంటోనీ సంగీతాన్ని అందించారు. వివిధ సమస్యల కారణంగా, గత 12 ఏళ్లుగా విడుదలకు నోచుకోకపోయిన ‘మదగజరాజా’, ప్రస్తుతం ఆ సమస్యలు తీరడంతో, ఎట్టకేలకు జనవరి 12న విడుదలైంది. అయితే, ఎవరూ ఊహించని విధంగా, ‘మదగజరాజా’ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ అందుకొని సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం విడుదలై ఇప్పటివరకు 40 కోట్లకు పైగా వసూలు చేసింది.
12 ఏళ్ల తరువాత విడుదలైన ‘మదగజరాజా’ ఘన విజయాన్ని సాధించడంతో, తమిళ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు విడుదలకు నోచుకోని కొన్ని చిత్రాలను విడుదల చేయాలని సంబంధిత చిత్రబృందాలు నిర్ణయించాయి. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో విక్రమ్ నటించిన ‘ధ్రువ నక్షత్రం’, సంతానం నటించిన ‘సర్వర్ సుందరం’, విజయ్ సేతుపతి నటించిన ‘ఇడమ్ పొరుల్ యేవల్’ వంటి చిత్రాలు త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నాయి.
-
Home
-
Menu