విజయ్ బాటలో అజిత్?

కోలీవుడ్ స్టార్ హీరో ఆజిత్ కుమార్ ఇటీవల భారత రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకొని చరిత్ర సృష్టించాడు. ఈ సందర్భంగా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు తన రిటైర్మెంట్ ప్లాన్, భవిష్యత్తు పై స్పందించాడు.
“నిజానికి ఇది నేను నిర్ణయించేదీ కాదు. ఏ రోజు అయినా రిటైర్ అయ్యే పరిస్థితిలో పడవచ్చు. జీవితం అంటే ఆశ్చర్యం. రోజుకోసారి మేల్కొని శ్వాస తీసుకోవడం కూడా ఒక ఆశీర్వాదం. దాన్ని నేను అర్థవంతంగా బ్రతకాలని కోరుకుంటు న్నాను” అని అన్నాడు.
ఆజిత్ ఈ మాటలు తాత్వికంగా కాదు, అనుభవంతోనే చెబుతున్నానని అన్నాడు. అనేక శస్త్రచికిత్సలు, క్యాన్సర్ నుండి బయటపడిన స్నేహితుల అనుభవాలు ఆయనను జీవితాన్ని మరింత విలువైనదిగా చూడటానికి దారితీశాయని చెప్పాడు.
“నన్ను ఈ లోకానికి పంపిన సృష్టికర్త నా జీవితం చూసి – ‘ఈ ప్రాణికి జీవితం ఇచ్చాను, అతను దాన్ని పూర్తిగా ఆస్వాదించాడు, ప్రతి క్షణాన్ని అర్థవంతంగా ఉపయోగించాడు’ అని అనుకోవాలి. నేను అలాంటి జీవితం బ్రతకాలి. సమయం వృథా చేయకూడదు” అని ఆజిత్ కుమార్ చెప్పాడు.
ఆజిత్ కుమార్ 1993లో 'అమరావతి' అనే చిత్రంతో కథానాయకుడిగా కోలీవుడ్ సినీరంగ ప్రవేశం చేశాడు. ఆ తర్వాత తెలుగులో ‘ప్రేమ పుస్తకం’ అనే చిత్రంలో కూడా నటించాడు. అనంతరం తమిళ చిత్రాలలో వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు.
మూడుదశాబ్దాలుగా తమిళ సినీ ప్రపంచంలో అగ్ర నటుడిగా వెలుగొందుతున్న ఆజిత్ కుమార్, ఇప్పుడు పద్మ పురస్కారం ద్వారా మరొక ఘనతను తన ఖాతాలో చేర్చుకున్నాడు.
ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, తమిళ సినీ రంగంలో ఆజిత్ కుమార్ సమకాలీనంగా భావించబడే దళపతి విజయ్ ఇప్పటికే తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించేందుకు సినీ రంగానికి వీడ్కోలు పలుకుతున్నట్టు ప్రకటించాడు. 'జన నాయకన్' అనే చిత్రంతో తన చివరి సినిమా చేయనున్నట్లు వెల్లడించాడు.
వర్క్ ఫ్రంట్ విషయానికి వస్తే.. అజిత్ కుమార్ చివరిసారి నటించిన చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ. ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ కామెడీ చిత్రంలో ఆయన ఏకే అలియాస్ రెడ్ డ్రాగన్ అనే క్రైమ్ లార్డ్ పాత్రలో కనిపించాడు. మరి అతడి చివరి సినిమా ఏది అవుతుందో చూడాలి.
-
Home
-
Menu