‘జన నాయకన్’ నుంచి అదిరిపోయే పాట రాబోతోంది !

తమిళ దళపతి విజయ్ తన కొత్త సినిమా ‘జననాయకన్’ కోసం ఓ అద్భుతమైన పాటను షూట్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా.. ఇది విజయ్ చివరి సినిమా కావడంతో.. ఈ ప్రాజెక్ట్‌పై అభిమానులు మరింత ఆసక్తిని కనబరుస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. విజయ్ పై త్వరలో ఓ విజువల్ గ్రాండియర్ సాంగ్ ను చిత్రీకరించనున్నారు. ఈ పాటకు సంబంధించిన సంగీతం, డ్యాన్స్, లొకేషన్ వంటి వివరాలు ఇంకా రహస్యంగా ఉంచినప్పటికీ... ఇది దృశ్యపరంగా అద్భుతంగా ఉంటుందని సమాచారం.
సినీ వర్గాల వారి సమాచారం ప్రకారం ఈ పాట ‘జననాయకన్’ చిత్రానికే హైలైట్ కానుంది. గ్రాండ్ స్కేల్‌లో నృత్య దర్శకత్వం, స్టైలిష్ విజువల్స్ ఉండబోతున్నాయి. ఇదివరకెప్పుడూ విజయ్ చేయని ఓ కొత్త తరహా పాట ఇది అని తెలుస్తోంది. ఈ పాట షూటింగ్ ఈ నెలాఖరులో చెన్నైలో ప్రారంభం కానుంది. పాట కోసం భారీ సెట్స్ వేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమా ఓ విజువల్ ట్రీట్‌లా ఉండబోతోంది. ప్రతి సన్నివేశం ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. విజయ్ ఈ చిత్రానికి ప్రాణం పోస్తున్నాడు. అతడి డెడికేషన్ చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఇది అభిమానులకు ఓ గొప్ప అనుభవాన్ని అందించబోతోంది.. అని మూవీ టీమ్ అంటోంది.
‘జన నాయకన్’లో విజయ్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తుండగా.. బాబీ డియోల్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నాడు. ఈ యాక్షన్ డ్రామా షూటింగ్ త్వరలో పూర్తవుతుందని అంచనా. అయితే.. సినిమా విడుదల తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ, 2026లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముందని టాలీవుడ్, కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
-
Home
-
Menu