సౌరవ్ గంగూలీ బయోపిక్ లో హీరో ఇతడే!

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ జీవితం ఆధారంగా తెరకెక్కనున్న బయోపిక్‌లో ప్రముఖ బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్ర పోషించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. గంగూలీ స్వయంగా ఈ విషయాన్ని ధృవీకరించారు. అయితే, ప్రాజెక్ట్‌కి సంబంధించిన షెడ్యూల్ సమస్యల వల్ల సినిమా పూర్తవడానికి ఒకటి కంటే ఎక్కువ సంవత్సరాలు పట్టొచ్చని పేర్కొన్నారు.
బర్ద్వాన్‌లో రీసెంట్ గా జరిగిన మీడియా సమావేశంలో గంగూలీ మాట్లాడుతూ, "నాకు తెలిసి రాజ్‌కుమార్ రావు ఈ పాత్రలో నటించనున్నాడు. కానీ షెడ్యూల్ సమస్యలున్నాయి. అందుకే ఈ సినిమా విడుదల కావడానికి మరికొంత సమయం పడుతుంది" అని తెలిపారు.
ఈ బయోపిక్‌పై కొంతకాలంగా చర్చలు జరుగుతున్నాయి. భారత క్రికెట్ జట్టును నూతన శక్తితో తీర్చిదిద్దిన గంగూలీ జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. విభిన్న పాత్రలు పోషించే సామర్థ్యం ఉన్న రాజ్‌కుమార్ రావును ఈ పాత్ర కోసం ఎంపిక చేశారు.
ప్రస్తుతం ప్రాజెక్ట్ ప్రాథమిక దశలో ఉంది. సినిమా విడుదల తేదీతో పాటు ఇతర నటీనటుల వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.
ఇక రాజ్‌కుమార్ రావో తాజా సినిమాల విషయానికి వస్తే, భూల్ చుక్ మాఫ్ అనే సినిమాలో వామికా గబ్బితో కలిసి నటించనున్నారు. అలాగే, ఆయన నటించిన గ్యాంగ్‌స్టర్ డ్రామా మాలిక్ 2025 జూన్ 20న థియేటర్లలో విడుదల కానుంది.
-
Home
-
Menu