సూపర్‌స్టార్ రజినీకాంత్‌కి గోల్డెన్ జూబిలీ

సూపర్‌స్టార్ రజినీకాంత్‌కి గోల్డెన్ జూబిలీ
X
1975లో ‘అపూర్వ రాగంగల్’తో మొదలైన ప్రయాణం… ఇప్పటికీ అదే ఉత్సాహం - ప్రధాని మోదీతో పాటు దేశవ్యాప్తంగా శుభాకాంక్షల వర్షం

సినీ రంగంలో అరుదైన ఘనత సాధించిన సూపర్‌స్టార్ రజినీకాంత్‌ 50 ఏళ్ల విజయప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో అభిమానులతో పాటు సినీ, రాజకీయ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

రజినీకాంత్‌ 50 ఏళ్ల సినీ ప్రయాణాన్ని గుర్తు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు, “రజినీకాంత్ సినిమాలు కేవలం వినోదమే కాదు, సమాజానికి స్పూర్తినిచ్చే సందేశాలను అందించాయి. ఆయన ప్రయాణం ప్రతి ఒక్కరికీ గర్వకారణం” అని ట్వీట్ చేశారు.

చంద్రబాబు చేసిన ట్వీట్‌ను రజినీకాంత్ రీషేర్ చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. “గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారూ, మీ ఆప్యాయమైన మాటలు, శుభాకాంక్షలు నా హృదయాన్ని తాకాయి. మీలాంటి స్నేహపూర్వక వ్యక్తుల ప్రేమ, ప్రోత్సాహం నాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. సినీ రంగంలో ఇంకా మంచి కృషి చేయాలని నాకు స్ఫూర్తినిస్తోంది” అని రజినీకాంత్ పేర్కొన్నారు.

1975 ఆగస్టు 15న తమిళంలో విడుదలైన 'అపూర్వ రాగంగల్' సినిమాతో రజినీకాంత్ తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. తొలి సినిమా నుంచే తన ప్రత్యేక శైలిని చూపించి, అప్పటి నుంచి ఇవాళ్టి వరకు ఎప్పుడూ వెనుకడుగు వేయకుండా ముందుకు సాగుతున్నారు. ఐదు దశాబ్దాలుగా కోట్లాది అభిమానులను అలరిస్తూ, దేశ విదేశాల్లో ఆరాధ్యుడిగా నిలిచారు.

రజినీకాంత్ సినిమాలు కేవలం వినోదం కాదు; ఆలోచన రేపే సందేశాలతో సమాజంలో మార్పు తీసుకువచ్చాయి. ఆయన సరళమైన వ్యక్తిత్వం, అద్భుతమైన నటన అభిమానుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయాయి. అందుకే ఈ 50 ఏళ్ల ఘన యాత్ర ఆయనకే కాక, ఆయనను ప్రేమించే కోట్లాది అభిమానులకు కూడా పండుగే అని చెప్పొచ్చు.

Tags

Next Story