ఫిష్ వెంకట్ ఆరోగ్యం విషమం

విలన్, కామెడీ పాత్రలతో గుర్తింపు పొందిన నటుడు ఫిష్ వెంకట్ ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధులతో పోరాడుతున్న ఆయన ఆరోగ్యం ఇటీవల పూర్తిగా క్షీణించడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై చికిత్స పొందుతుండగా, ఎవరినీ గుర్తు పట్టలేని స్థితికి చేరినట్లు సమాచారం.
వెంకట్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన కుటుంబం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆసుపత్రి ఖర్చులు భరించలేని పరిస్థితిలో ఉన్నారు. కిడ్నీ మార్పిడే శాశ్వత పరిష్కారమని వైద్యులు సూచించడంతో, ఆపరేషన్ కోసం దాతల సహాయం అవసరమవుతోంది. ఆయన భార్య, కుమార్తె మీడియా ద్వారా కన్నీటి పర్యంతమవుతూ సాయంగా నిలవాలని వేడుకున్నారు.
గతంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందించిన సందర్భం కూడా ఉంది. 'ఆది'లో వెంకట్ చెప్పిన 'తొడ గొట్టు చిన్నా' అనే డైలాగ్ ఎంతో పాపులర్. 'గబ్బర్ సింగ్' సినిమాతోనూ వెంకట్ కి మంచి గుర్తింపు వచ్చింది. దాదాపు 100కు పైగా చిత్రాల్లో తన ప్రత్యేకతను చాటిన ఈ నటుడు ప్రాణాపాయ స్థితిలో ఉండటం సినీ అభిమానులను కలిచివేస్తోంది.
-
Home
-
Menu