సినీ వర్కర్స్ సమ్మె పై సర్వత్రా ఉత్కంఠ

టాలీవుడ్‌లో కొనసాగుతున్న సినీ కార్మికుల సమ్మెపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు కార్మికశాఖ చురుకైన పాత్ర పోషిస్తోంది. కార్మికశాఖ ఆధ్వర్యంలో నిర్మాతలు, ఫెడరేషన్ ప్రతినిధుల మధ్య కీలకమైన సమావేశం జరుగుతుంది. ఈ క్రమంలో నిర్మాతల తరఫున బాపినీడు, సుప్రియ, చెర్రీతో పాటు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్, కార్యదర్శి దామోదర ప్రసాద్, ఫెడరేషన్ నాయకులు చిక్కడపల్లి లేబర్ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్నారు.
ఇప్పటికే ఇరు వర్గాల మధ్య కొన్ని అంశాలపై అంగీకారం కుదిరినప్పటికీ, ఇంకా కొలిక్కిరాని సమస్యల పరిష్కారం కోసం కార్మికశాఖ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసే యోచనలో ఉంది. ఇక కొందరు సినీ ప్రముఖులు ప్రభుత్వాన్ని పక్కదారి పట్టించడం వలనే సమ్మె విరమణలో జాప్యం అయ్యిందని కొంతమంది విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు, కార్మికశాఖ జోక్యం లేకుండానే గతంలో ఇలాంటి సమస్యలను పరిష్కరించుకున్నామని కొందరు నిర్మాతలు గుర్తు చేస్తున్నారు.
సమ్మె కొనసాగుతుండటంతో తమకు భారీ ఇబ్బందులు ఎదురయ్యాయని మెజార్టీ నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు వ్యక్తులు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం కార్మికులు – నిర్మాతల మధ్య గ్యాప్ పెంచారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఈరోజు జరిగే చర్చలతో సమ్మెకు ముగింపు పలికే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. రేపటి నుంచే షూటింగ్‌లు పునఃప్రారంభం అయ్యే అవకాశముందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
-
Home
-
Menu