ఆర్జీవీపై కేసు నమోదు

టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పేరు వినగానే సంచలనాలు గుర్తుకు వస్తాయి. సినిమాలు ఎలా తీయాలో తనకంటూ ఓ స్టైల్ ఉన్నా, వాటికన్నా ఎక్కువ చర్చలు ఆయన వివాదాల వల్లే జరుగుతుంటాయి. లేటెస్ట్ గా మరో వివాదంలో చిక్కుకున్నాడు వర్మ. ఆర్జీవి తెరకెక్కించిన ‘దహనం’ వెబ్ సిరీస్ ఈ వివాదానికి కారణమయ్యింది.
హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అంజనా సిన్హా ఫిర్యాదు చేయడంతో, వర్మపై IPC 509, 468, 469, 500, 120(B) సెక్షన్ల కింద కేసు నమోదైంది. తన అనుమతి లేకుండా తన పేరు, ప్రొఫైల్‌ను ‘దహనం‘ సిరీస్‌లో వాడారని ఆమె ఆరోపించారు. అంతేకాదు, తానే చెప్పినట్లుగా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారన్న వర్మ వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధమని కూడా స్పష్టం చేశారు.
‘దహనం’ కథ ఫ్యూడలిస్టులు – నక్సలైట్ల మధ్య పోరాటం, కమ్యూనిస్టు నేత రాములు హత్య, ప్రతీకార యాత్ర చుట్టూ తిరుగుతుంది. ఈ కథలో తన పేరును తప్పుగా వాడారని అంజనా సిన్హా కోర్టు దాకా వెళ్లారు. ఇప్పటికే ‘వ్యూహం, లక్ష్మీస్ ఎన్టీఆర్’ వంటి సినిమాలపై కేసులు ఎదుర్కొంటున్న ఆర్జీవీకి, ఈసారి కూడా చట్టపరమైన చిక్కులు తప్పనట్లే కనిపిస్తున్నాయి.
-
Home
-
Menu