మూడో మున్నాభాయ్ కోసం మక్కళ్ సెల్వన్?

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణి తెరకెక్కించిన మున్నాభాయ్ సీరీస్ సినిమాలకు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. సంజయ్ దత్ ప్రధాన పాత్రలో నటించిన ‘మున్నాభాయ్ యంబీ బీయస్, లగే రహో మున్నాభాయ్’ బ్లాక్ బస్టర్ విజయాలు సాధించి.. ప్రేక్షకులను మెప్పించాయి. చాలా కాలం గ్యాప్ తరువాత ఇప్పుడు మున్నాభాయ్ సీరీస్‌లో మూడో భాగాన్ని తెరపైకి తీసుకురావడానికి హిరాణి టీమ్ సన్నాహాలు చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన కథ చర్చలు జరుగుతున్నాయట. మూడో భాగంలో కూడా సంజయ్ దత్‌నే ప్రధాన పాత్రలో కంటిన్యూ అవుతాడు.
ఇక మున్నాభాయ్ సిరీస్ లోని ఈ మూడో భాగంలో సౌత్ స్టార్ .. మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతిని కూడా కీలక పాత్రలోకి తీసుకోవాలని చర్చలు జరుగుతున్నాయని బాలీవుడ్ సమాచారం. విజయ్ సేతుపతి, తన నటనతో ఎలాంటి పాత్రకైనా న్యాయం చేస్తారని, అందుకే ఈ సినిమాలో ఆయన చేరిక సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. ఈ మధ్య విజయ్ సేతుపతి పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు పొందారు. ఆయన పాత్ర చిత్రణ సినిమాకు విశేష క్రేజ్‌ను తీసుకురావడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే, మున్నాభాయ్ సీరీస్‌లో సంజయ్ దత్ కామెడీ టైమింగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. కానీ ఇటీవలి కాలంలో ఆయన ఎక్కువగా సీరియస్ పాత్రలనే చేస్తూ కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మున్నాభాయ్ 3తో ఆయన మళ్లీ తన కామెడీ యాంగిల్‌ని చూపించేందుకు సిద్ధమవుతున్నారు.
ఇంతకుముందు మున్నాభాయ్ సీరీస్ సినిమాలను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేయడం తెలిసిందే. ‘శంకర్ దాదా యంబీ బీయస్, శంకర్ దాదా జిందాబాద్’ చిత్రాలతో చిరంజీవి సూపర్ హిట్ విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. ఇక మూడో భాగం కూడా పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తారా లేదా బాలీవుడ్ ప్రేక్షకులకే పరిమితం చేస్తారా అనేది ఆసక్తికరమైన అంశం. ‘మున్నాభాయ్ 3’ చిత్రంలో సంజయ్ దత్, విజయ్ సేతుపతి కాంబినేషన్ ఖాయమైతే.. ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్‌ను తీసుకురావడం ఖాయం.
-
Home
-
Menu