వరుణ్ ధావన్, శ్రీలీల రొమాంటిక్ ఎంటర్ టైనర్ !

వరుణ్ ధావన్, శ్రీలీల రొమాంటిక్ ఎంటర్ టైనర్ !
X

ఇటీవలే ‘బోర్డర్ 2’ చిత్రం కోసం 45 రోజుల కఠినమైన షెడ్యూల్‌ను పూర్తి చేసిన వరుణ్ ధావన్.. తన తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా డేవిడ్ ధావన్ దర్శకత్వంలో రూపుదిద్దు కుంటోంది. ఈ చిత్రంతో వరుణ్ తన తండ్రితో కలిసి నాలుగోసారి వర్క్ చేయబోతున్నాడు. వీరిద్దరి కలయికలో వచ్చిన "మేన్ తేరా హీరో, జుడ్వా 2 , కూలీ నెం.1’ మంచి హిట్‌లుగా నిలిచాయి.

ఈ చిత్రాన్ని రమేశ్ తౌరానీ టిప్స్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోంది. ఆసక్తికరంగా, ఈ సినిమా ద్వారా కన్నడ నటి శ్రీలీల బాలీవుడ్‌కు పరిచయం కాబోతోంది. ఆమెతో పాటు మృణాల్ ఠాకూర్, మనీష్ పాల్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ముంబయి, గోవా షెడ్యూల్‌లు పూర్తయ్యాయి. ఇక మే, జూన్ నెలల్లో యునైటెడ్ కింగ్‌డమ్‌లో విస్తృతంగా షూటింగ్ జరగనుంది.

డేవిడ్ ధావన్ తన కామెడీ స్టైల్ ను ఈ సినిమాలో కూడా కొనసాగిస్తూనే.. దీనికి అంతర్జాతీయ టచ్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తాజా సమాచారం ప్రకారం, లండన్‌లో ప్రముఖ ప్రదేశాల్లో చిత్రీకరణ జరగనుంది. పికాడిల్లీ సర్కస్ వంటి అందమైన లొకేషన్లను ఇందులో ఉపయోగించనున్నారు. ముఖ్యంగా, సినిమాలో ఒక గ్రాండ్ డాన్స్ నంబర్‌ను ప్లాన్ చేశారు. ఇది సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

లండన్‌లోని శిఖర స్థాయిలో ఉన్న నగర దృశ్యాలతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఓ వారం పాటు షూటింగ్ జరుపనున్నారు. "గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని కీలకమైన ప్రేమకథా దృశ్యాలతో పాటు, ఒక ఆసక్తికరమైన ఛేజ్ సీక్వెన్స్ కూడా ఉంటాయి" అని సమాచారం.

వరుణ్ ధావన్ ప్రస్తుతం "సన్నీ సంస్కారి కీ తులసి కుమారి" సినిమాకు సంబంధించిన పనులను పూర్తి చేసిన తర్వాత.. మేలో లండన్ బయలుదేర నున్నాడు. ‘బోర్డర్ 2’ చిత్ర పనులను పూర్తిచేసిన తర్వాతే ఆయన ఈ సినిమాకు పూర్తి సమయాన్ని కేటాయించనున్నాడు. ఈ కొత్త ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి, ముఖ్యంగా శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ కావడంతో సినీ ప్రియులు మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags

Next Story