ఇకపై నేను స్పై థ్రిల్లర్ మూవీస్ చేయను : తాప్సీ పన్ను

తాప్సీ పన్ను నటించిన "నామ్ షబానా" బాలీవుడ్ సినిమా 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. విభిన్నమైన పాత్రలను పోషిస్తూ తన ప్రత్యేకతను నిరూపించుకున్న తాప్సీ, బాలీవుడ్‌లో యాక్షన్-స్పై థ్రిల్లర్ జానర్‌ను ఎంచుకున్న కొద్ది మంది నాయికల్లో ఒకరు. "పింక్", "బేబీ", "నామ్ షబానా" సినిమాల్లో ఆమె చేసిన నటన యాక్షన్ పాత్రల పట్ల ఆమె నిబద్ధతను స్పష్టంగా చూపించింది. "నామ్ షబానా" ఒక ఆసక్తికరమైన స్పై థ్రిల్లర్. ఇందులో తాప్సీ బలమైన యాక్షన్ సన్నివేశాలను అద్భుతంగా పోషించింది. గూఢచారి సంస్థలో చేరిన షబానా అనే యువతి చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. శిక్షణ పొందిన తర్వాత, ఆమె ఒక ప్రమాదకరమైన ఆయుధ వ్యాపారిని చంపడానికి బయలుదేరుతుంది.
తాప్సీ మాట్లాడుతూ, "బేబీ" సినిమాకు వచ్చిన గొప్ప స్పందన వల్లే "నామ్ షబానా" తెరకెక్కింది అని వెల్లడించింది. “బేబీ సినిమాలో నా పాత్రకు వచ్చిన స్పందన చూసి, దర్శకనిర్మాతలు షబానా అర్థాత్ మీరా పాత్ర ఆధారంగా ఓ చిత్రాన్ని ప్లాన్ చేశారు. నిజానికి.. ఇది సీక్వెల్ గానీ, ప్రీక్వెల్ గానీ కాదు” అని చెప్పింది. ఈ సినిమా విషయంలో అక్షయ్ కుమార్ కూడా తాప్సీ నిబద్ధతను ప్రశంసించారు. “పింక్‌లో ఆమె అద్భుతమైన నటన చూపించింది. బేబీ సినిమాలో ఆమె చేసిన యాక్షన్ సన్నివేశాలను చూసి నేను ఆశ్చర్యపోయాను. ఇంత సంపూర్ణంగా యాక్షన్ చేసే హీరోయిన్‌ను నేను చూసిన దాఖలాలు లేవు. ఆమె నిజంగా ఎంతో ప్రేరణనిచ్చే వ్యక్తి” అని చెప్పారు.
ఇక స్పై థ్రిల్లర్ జానర్ గురించి తాప్సీ మాట్లాడుతూ, తాను ఈ తరహా చిత్రాలను మళ్లీ చేయదలచుకోలేదని చెప్పింది. “అప్పట్లో స్పై థ్రిల్లర్ సినిమాలు ట్రెండ్‌లో లేవు. ఇప్పుడు అందరూ ఆ జానర్‌ను ఎంచుకుంటున్నారు. కానీ నేను అప్పుడే చేశాను. ఇప్పుడు మళ్లీ చేస్తే, అదే పనిగా తానెందుకు ఒకే తరహా చిత్రాలు చేస్తున్నానని అనిపించొచ్చు. అప్పట్లో అది ఎంతో ప్రత్యేకమైనది. దాన్ని మళ్లీ చేయడం వల్ల దాని ప్రాముఖ్యతను తగ్గించుకోవడం అనవసరం” అని తెలిపింది.
తాజా సినిమాల విషయానికి వస్తే, తాప్సీ మళ్లీ యాక్షన్-థ్రిల్లర్ జానర్‌లోకి వస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న "గాంధారి" సినిమా ఈ ఏడాదే విడుదల కానుంది. ఇందులో కిడ్నాప్ అయిన తన కొడుకుని రక్షించేందుకు పోరాడే తల్లిగా కనిపించనుంది. అన్ని యాక్షన్ సన్నివేశాలు స్వయంగా చేయడం ద్వారా, తల్లి మనసులో ఉండే అసలైన ఆవేశాన్ని తెరపై మలిచేందుకు కృషి చేస్తోంది. భావోద్వేగాలు, యాక్షన్ కలబోసిన ఈ సినిమా ప్రేక్షకులకు ఓ పవర్ఫుల్ అనుభూతిని అందించనుంది.
-
Home
-
Menu