సోనూసూద్‌కు హ్యూమానిటేరియన్ అవార్డు!

ప్రముఖ నటుడు సోనూ సూద్‌కు 72వ మిస్ వరల్డ్ ఫెస్టివల్‌లో హ్యూమాని టేరియన్ అవార్డును ప్రదానం చేయనున్నారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో చేసిన సేవా కార్యక్రమాలను గుర్తించి ఈ అవార్డును అందించనున్నారు. ఈ వేడుక మే 31న హైదరాబాద్‌లోని హైటెక్స్ అరేనాలో జరుగనుంది.
మిస్ వరల్డ్ సంస్థ చైర్‌పర్సన్ జూలియా మోర్లే మాట్లాడుతూ.. “సోనూ సూద్ సేవలు మా సంస్థ మౌలిక సూత్రమైన 'బ్యూటీ విత్ ఎ పర్పస్' కు నిజమైన ప్రతిరూపం. మానవతా పరమైన అద్భుత సేవలకుగాను సోనూ సూద్‌కు ఈ పురస్కారాన్ని అందించడం గర్వకారణం,” అన్నారు. “ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారికి ఆయన చేసిన పనులు ప్రేరణనిస్తూనే ఉన్నాయి. ఇలాంటి అసాధారణ వ్యక్తిని మా వేదికపై సత్కరించగలగడం గర్వంగా ఉంది,” అని ఆమె తెలిపారు.
ఈ అవార్డును అందుకోటానికి తోడు, సోనూ సూద్ మిస్ వరల్డ్ 2025 గ్రాండ్ ఫినాలేకు జడ్జ్‌గా కూడా వ్యవహరించనున్నారు. మిస్ వరల్డ్ వారి అధికారిక పీఆర్ హ్యాండిల్ అయిన ఆల్టెయిర్ మీడియా ద్వారా విడుదల చేసిన ప్రకటనలో సోనూ సూద్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. “హ్యూమానిటేరియన్ అవార్డు పొందడం నాకు చాలా గర్వకారణం. ఈ గౌరవాన్ని నేను సూద్ చారిటీ ఫౌండేషన్ ద్వారా మేం స్పర్శించిన ప్రతి జీవితంతో, ప్రతి వాలంటీర్‌తో పంచుకుంటున్నాను,” అని చెప్పారు.
లాక్‌డౌన్ సమయంలో దేశం నలుమూలలలో వలస కూలీలకు రవాణా సదుపాయాలు, వైద్య సాయం, ఉచిత విద్య, ఉద్యోగ శిక్షణ వంటి ఎన్నో కార్యక్రమాలను సోనూ సూద్ చేపట్టారు. ఆయన స్థాపించిన సూడ్ చారిటీ ఫౌండేషన్ లక్షలాది మంది జీవితాల్లో మార్పు తీసుకొచ్చింది.
-
Home
-
Menu