ఈ స్టార్ వారసుడు కూడా ఎంట్రీ ఇచ్చేస్తున్నాడు!

బాలీవుడ్‌లో ఖాన్ కుటుంబాల వారసులు వరుసగా అడుగుపెడుతున్నారు. షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ ఇప్పటికే నటిగా పరిచయమైంది. ఆయన తనయుడు ఆర్యన్ ఖాన్ కూడా దర్శకుడిగా సినీ ప్రస్థానం ప్రారంభించనున్నాడు. అలాగే.. ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ ఇప్పటికే పలు చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్, అమృతా సింగ్ కుమారుడు ఇబ్రాహీం అలీ ఖాన్ హీరోగా తెరంగేట్రం చేయనున్నాడు.
ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ అతనిని ‘నాదానియాన్’ అనే ప్రేమకథా చిత్రంతో పరిచయం చేస్తున్నారు. ఈ యువ ప్రేమకథలో ఇబ్రాహీంకు జోడీగా శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ నటిస్తోంది. 2023లో ది ‘ఆర్చీస్’ వెబ్ సిరీస్ తో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఖుషీ కపూర్.. ఇప్పుడు ఈ సినిమా కోసం కరణ్ జోహార్ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ తో కలిసి పనిచేస్తోంది. నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించడంతో పాటు, ఆకట్టుకునే పోస్టర్‌ను విడుదల చేసింది.
మరోవైపు.. ఖుషీ కపూర్ త్వరలో ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్‌తో కలిసి ‘లవ్యాపా’ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా 2025 ఫిబ్రవరి 7న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక, ఇబ్రాహీం అలీ ఖాన్ నటించిన ‘నాదానియాన్’ ఖుషీ కపూర్ నటించిన మూడవ చిత్రం కానుంది. మరి హీరోగా సైఫ్ కొడుకు ఏ రేంజ్ లో క్లిక్ అవుతాడో చూడాలి.
-
Home
-
Menu