మాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ బాలీవుడ్ ఎంట్రీ!

మాలీవుడ్ లో తనదైన ముద్ర వేసిన యాక్షన్ ఎక్స్‌పర్ట్ హనీఫ్ అదేనీ. ఇప్పుడు బాలీవుడ్‌లో అడుగు పెడుతున్నాడు. రీసెంట్ గా ‘మార్కో’ అనే యాక్షన్ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న అతడు.. ఇప్పుడు ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ధర్మా ప్రొడక్షన్స్‌తో చేతులు కలిపి.. హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ రూపొందించ బోతున్నారు. ఈ సినిమా స్టైలిష్‌గా, సైలెంట్ గా ఉండడమే కాకుండా.. ఓ ఫీల్ గుడ్ కథాంశంతో తెరకెక్కుతోంది. ఈ భారీ యాక్షన్ సినిమా హిందీతో పాటు మరికొన్ని భాషల్లో రూపొందనున్నట్లు సమాచారం.
హనీఫ్ అదేనీ మలయాళ సినిమా పరిశ్రమలో తన ప్రత్యేకమైన శైలితో గుర్తింపు తెచ్చుకున్నాడు. 2017లో మమ్ముట్టి ప్రధాన పాత్రలో వచ్చిన ‘ద గ్రేట్ ఫాదర్’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. అనంతరం 2017లో ఆమీర్, 2018లో ‘అబ్రహామిండే సంతతికల్’ చిత్రాలకు కథ అందించాడు. 2019లో ఆయన దర్శకత్వం వహించిన ‘మిఖాయేల్’ సినిమా మలయాళ ప్రేక్షకులను అలరించగా.. 2023లో నివిన్ పాలీ హీరోగా నటించిన ‘రామచంద్ర బాస్ అండ్ కో’ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే ‘మిఖాయేల్’ కు స్పిన్‌ఆఫ్‌గా రూపొందించబడిన మార్కో మూవీ, బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది.
ఇప్పుడు హనీఫ్ అదేనీ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది. మలయాళం సినిమాల్లో తన ప్రత్యేకమైన యాక్షన్ స్టైల్‌ను చూపించిన అతడు , ఇప్పుడు హిందీ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనున్నాడని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
-
Home
-
Menu