పంజాబీ చిత్ర పరిశ్రమలోకి కరణ్ జోహార్ ఎంట్రీ !

పంజాబీ చిత్ర పరిశ్రమలోకి కరణ్ జోహార్ ఎంట్రీ !
X

బాలీవుడ్ దిగ్గజ నిర్మాత కరణ్ జోహార్, పంజాబీ సినిమా ప్రపంచంలోకి ప్రవేశిస్తున్నారు. ఆయన గిప్పీ గ్రెవాల్ ప్రధాన పాత్రలో నటించి, దర్శకత్వం వహించిన "అకాల్" అనే ప్రతిష్ఠాత్మక చిత్రంతో ఈ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. ఇటీవల కరణ్ జోహార్ తన సోషల్ మీడియా ఖాతాలో ఈ ప్రాజెక్ట్‌పై సంతోషం వ్యక్తం చేస్తూ.. ఈ సినిమాతో తాను కలసి పనిచేయడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని వెల్లడించారు.

కరణ్ జోహార్ తన పోస్ట్‌లో.. ధర్మ ప్రొడక్షన్స్ తరఫున పంజాబీ సినిమా రంగంలోకి అడుగుపెడుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. గిప్పీ గ్రెవాల్ వంటి ప్రతిభావంతుడైన కళాకారుడితో మా తొలి ప్రయాణాన్ని ప్రారంభించడం గర్వంగా ఉంది. 'అకాల్' పంజాబ్ సంస్కృతి, చరిత్రను ప్రతిబింబించే చిత్రమైతే, ఇది భారతదేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని నమ్ముతున్నాను. అందుకే, ప్రపంచవ్యాప్తంగా హిందీ భాషలో విడుదల కానున్న తొలి పంజాబీ చిత్రం ‘అకాల్’ను మా బ్యానర్‌లో అందించడంపై మేము మరింత గర్విస్తున్నాం... అని రాశారు.

ఇక గిప్పీ గ్రెవాల్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. ఇది మా గొప్ప భాగస్వామ్యానికి ఒక అద్భుతమైన ప్రారంభం. భవిష్యత్తులో కూడా సినిమా ప్రేమికులుగా మేము కలిసి పని చేయాలని ఆశిస్తున్నాను! ‘అకాల్’ ఏప్రిల్ 10, 2025న ప్రపంచవ్యాప్తంగా పంజాబీ, హిందీ భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది." అని కరణ్ జోహార్ తెలిపారు.

ఈ చిత్రంలో గిప్పీ గ్రెవాల్ ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా, దీనికి రచయితగా మరియు దర్శకుడిగా కూడా వ్యవహరించారు. ఈ చిత్రంలో నిమ్రత్ ఖైరా, అపిందర్‌దీప్ సింగ్, మీతా వశిష్ట్, ప్రిన్స్ కన్వల్‌జిత్ సింగ్, నికితిన్ ధీర్, గురుప్రీత్ ఘుగ్గి, షిందా గ్రెవాల్, ఏకోమ్ గ్రెవాల్, జగ్గీ సింగ్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటించారు.

Tags

Next Story