ఈ బాలీవుడ్ క్లాసిక్ కు సీక్వెల్ రాబోతోందా?

ఈ బాలీవుడ్ క్లాసిక్ కు సీక్వెల్ రాబోతోందా?
X

బాలీవుడ్‌లో స్నేహం, సాహసం, జీవిత సత్యాలను అందంగా మిళితం చేసిన క్లాసిక్ సినిమా ‘జిందగీ నా మిలేగి దోబారా’. ఈ సూపర్ హిట్ క్లాసిక్ సినిమాకి సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. అయితే ఆ సమయం రానే వచ్చింది. త్వరలోనే ‘జిందగీ నా మిలేగి దోబారా 2’ రాబోతున్నట్టు అర్ధమవుతోంది.

మార్చి 1న హృతిక్ రోషన్, అభయ్ దియోల్, ఫర్హాన్ అక్తర్ ముగ్గురూ తమ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ చేశారు. ఈ ఫోటోలో వారు ‘‘జిందగీ నా మిలేగి దోబారా ’ సినిమాకు సంబంధించిన దుస్తులు ధరించి ఓపెన్ రోడ్‌పై కారుపై కూర్చొని కనిపించారు. అయితే, దీనికి వారు ఇచ్చిన "కొంచెం టైమ్ పట్టొచ్చు. కానీ మేం చివరికి యస్ చెప్పాం" అనే క్యాప్షన్ ఆసక్తిని పెంచింది. అయితే కొన్ని హ్యాష్‌ట్యాగ్‌లు ఉండటంతో ఇది ఒక యాడ్ క్యాంపెయిన్ కావచ్చని అనుమానాలు వ్యక్తమయ్యాయి.

అయితే, అభిమానులు మాత్రం ‘జిందగీ నా మిలేగి దోబారా’ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఒక అభిమాని కామెంట్ చేస్తూ, “ఇలా ‘జిందగీ నా మిలేగి దోబారా 2’ టీజర్ ఇవ్వడం సరదాగా అనుకోవద్దు.. అంటూ ఫేమస్ డైలాగ్‌ని ట్విస్ట్ ఇచ్చారు. ఇటీవల అభయ్ డియోల్, ఫర్హాన్ అక్తర్ కలసి జోయా అక్తర్‌తో సరదాగా ఈ సినిమా సీక్వెల్ గురించి వీడియోలో చర్చించుకోవడం, అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తించింది.

జోయా అక్తర్ దర్శకత్వంలో 2011లో వచ్చిన ‘జిందగీ నా మిలేగి దోబారా’ మూవీ ఎనలేని క్రేజ్ తెచ్చుకుంది. యూత్ నుంచి ఫ్యామిలీ ఆడియెన్స్ వరకు అందరికీ కనెక్ట్ అయ్యేలా స్నేహితుల మధ్య అనుబంధాన్ని, కొత్త అనుభవాలను, జీవన మార్గాన్ని చక్కగా చూపించింది. మరి నిజంగానే ‘‘జిందగీ నా మిలేగి దోబారా’ సీక్వెల్ వస్తుందా? లేదా ఇదంతా ఒక బ్రాండ్ ప్రమోషన్‌ మాత్రమేనా? అనేది చూడాలి!

Tags

Next Story