ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు వాల్ కిల్మర్ కన్నుమూత

ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు వాల్ కిల్మర్  కన్నుమూత
X
గొంతు క్యాన్సర్ కారణంగా ఆయన తన మాటతీరు కోల్పోయారు. సినిమాలకు కొంతకాలం దూరంగా ఉన్నప్పటికీ, 2021లో టామ్ క్రూయిజ్ ప్రధాన పాత్రలో వచ్చిన 'టాప్ గన్: మావెరిక్' ద్వారా ఆయన వెండితెరపై తిరిగి సందడి చేశారు.

లాస్ ఏంజెలెస్‌లో ప్రముఖ హాలీవుడ్ నటుడు వాల్ కిల్మర్ తుదిశ్వాస విడిచారు. న్యూమోనియా కారణంగా ఆయన మృతి చెందినట్టు ఆయన కుమార్తె చెప్పిన సమాచారాన్ని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. 2014లో ఆయన గొంతులో కేన్సర్ సోకినప్పటికీ, వ్యాధి నుంచి కోలుకున్నారని కుమార్తె వివరించింది.

1990 వ దశకంలో హాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం అందుకున్న నటుల్లో వాల్ కిల్మర్ ఒకరు. 1986లో విడుదలైన ‘టాప్ గన్’ చిత్రంలో సహాయ పాత్ర పోషించడం ద్వారా ఆయన విశేషమైన గుర్తింపు పొందారు. 1991లో ఒలివర్ స్టోన్ దర్శకత్వంలో వచ్చిన ‘ది డోర్స్’ చిత్రంలో ప్రముఖ గాయకుడు జిమ్ మోరిసన్ పాత్రను పోషించడంతో ఆయన పేరు మరింతగా ప్రాచుర్యం పొందింది. వాల్ కిల్మర్ 'టూమ్‌స్టోన్', 'హీట్', 'బ్యాట్‌మాన్ ఫొరెవర్' వంటి అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాయి.

గొంతు క్యాన్సర్ కారణంగా ఆయన తన మాటతీరు కోల్పోయారు. సినిమాలకు కొంతకాలం దూరంగా ఉన్నప్పటికీ, 2021లో టామ్ క్రూయిజ్ ప్రధాన పాత్రలో వచ్చిన 'టాప్ గన్: మావెరిక్' ద్వారా ఆయన వెండితెరపై తిరిగి సందడి చేశారు. అదే ఏడాది 'వాల్' అనే డాక్యుమెంటరీ రూపంలో ఆయన జీవితాన్ని చిత్రీకరించారు. హాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసుకున్న వాల్ కిల్మర్ అకాలమరణం సినీ ప్రేమికులను విషాదంలో ముంచేసింది.

Tags

Next Story