హాలీవుడ్ లెజెండ్ బ్రూస్ విల్లీస్ ఆరోగ్య పరిస్థితి విషమం

హాలీవుడ్ లెజెండ్ బ్రూస్ విల్లిస్ ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని హలీవుడ్ మీడియా వెల్లడించింది. ‘డై హార్డ్, పల్ప్ ఫిక్షన్, ది సిక్స్త్ సెన్స్, రెడ్’ వంటి చిత్రాల్లో నటనతో ప్రసిద్ధి చెందిన ఈ అమెరికన్ నటుడు.. గత కొన్ని సంవత్సరాలుగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాడు. అతనికి ఫ్రాంటోటెంపరల్ డిమెన్షియా అనే వ్యాధి ఉంది. ఇది ప్రవర్తన, భాష, వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తుంది. 70 ఏళ్ల బ్రూస్‌కు ఇప్పుడు మాట్లాడే సామర్థ్యం దాదాపు పూర్తిగా కోల్పోయినట్లు, శరీరాన్ని కదిలించడంలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నట్లు రిపోర్ట్‌లో తెలుస్తోంది.
కమ్యూనికేషన్ సామర్థ్యాన్ని ప్రభావితం చేసే అఫాసియా అనే నాడీ సంబంధిత వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత, 2022 మార్చిలో బ్రూస్ విల్లిస్ నటనా రంగం నుంచి విరమించాడు. ఈ విషయాన్ని అతని కుటుంబం స్వయంగా తెలియజేసింది. 2023లో అతనికి ఫ్రాంటోటెంపరల్ డిమెన్షియా నిర్ధారణ అయింది.తార భార్య ఎమ్మా హెమింగ్, మాజీ భార్య డెమీ మూర్, వారి పిల్లలతో సహా కుటుంబం అతన్ని సంరక్షించడానికి, ఈ వ్యాధి గురించి అవగాహన కల్పించడానికి ఒక్కటిగా నిలబడి ఉంది.
హెల్త్‌లైన్ ప్రకారం.. మాట్లాడటం లేదా మాటలను అర్థం చేసుకోవడంలో ఇబ్బంది, వ్యక్తిత్వంలో మార్పులు, విచక్షణ నష్టం వంటి వివిధ లక్షణాలకు ఫ్రాంటోటెంపరల్ డిమెన్షియా దారితీస్తుంది. దీనికి ప్రస్తుతం ఎలాంటి మందులు లేవు. లక్షణాలను నియంత్రించి, రోగి జీవన నాణ్యతను మెరుగుపరచడంపై చికిత్స దృష్టి సారిస్తుంది. మెదడులోని కమ్యూనికేషన్‌కు సహాయపడే వివిధ భాగాలు దెబ్బతిన్నప్పుడు అఫాసియా అనే వ్యాధి సంభవిస్తుంది. ఈ పరిస్థితి ప్రధానంగా మెదడు ఎడమ వైపును ప్రభావితం చేస్తుంది. ఇది భాషను వ్యక్తీకరించడం, అర్థం చేసుకోవడం వంటి సామర్థ్యాలను అడ్డుకుంటుందని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆన్ డెఫ్‌నెస్ అండ్ అదర్ కమ్యూనికేషన్ డిసార్డర్స్ తెలిపింది.
-
Home
-
Menu