ధనుష్ - ఆనంద్ యల్. రాయ్ కాంబో రిపీట్

2013లో వచ్చిన ‘రాంఝానా’ సినిమాతో ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్, తమిళ స్టార్ హీరో ధనుష్ మరోసారి భారీ ప్రేమకథ ‘తేరే ఇష్క్ మేన్’ కోసం చేతులు కలిపారు. ఈ సినిమాలో ధనుష్ సరసన కృతి సనన్ తొలిసారి నటిస్తుండగా.. ఈ కొత్త జోడీపై ప్రేక్షకుల ఆసక్తి మరింత పెరుగుతోంది.
కృతి సనన్ ఫస్ట్ లుక్ వీడియో తాజాగా విడుదల కాగా.. అది నిజంగా గుండెను కదిలించేలా ఉంది. వీడియోలో.. కృతి ఒక యుద్ధ వాతావరణంలో నడుచుకుంటూ వస్తూ కనిపిస్తుంది. అల్లకల్లోలమైన ఆ పరిస్థితుల్లో ఆమె బాధతో నిండిన ముఖం ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తోంది. కథా సస్పెన్స్‌ను పెంచుతూ, ఆమె పెట్రోల్ పోసుకుని నిప్పు పెట్టుకోవడానికి సిద్ధమవుతుంది. ఆ తర్వాత ఏమవుతుందనేది ఇప్పటికి మిస్టరీగానే ఉంచారు. కానీ ఈ ఫస్ట్ లుక్ అందరినీ ఉర్రూతలూగిస్తోంది.
ఈ ఫస్ట్ లుక్ విడుదలకు ముందు.. మరో టీజర్ రిలీజ్ చేశారు. అందులో గుండెను తాకే వాయిస్ ఓవర్‌తో ఒక పాత్ర భావోద్వేగపూరితంగా ప్రశ్నిస్తుంది. ‘శంకర్, ప్రేమలో కేవలం అబ్బాయిలే చస్తారా? కొంతమంది అమ్మాయిలకూ ప్రాణం అర్పించే గుండె ఉంటుంది’.. అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది. కృతి పాత్ర భావోద్వేగాలు, పాత్రకు ఉన్న మార్పులు ఈ కథను మరింతగా స్పష్టంగా చెబుతున్నాయి. ఈ చిత్రానికి ఏ.ఆర్.రహమాన్ సంగీతాన్ని సమకూరుస్తుండగా, ఇర్షాద్ కామిల్ సాహిత్యాన్ని అందిస్తున్నారు. రాంఝానా, అత్రంగి రే సినిమాల తరహాలోనే భావోద్వేగాలను ఆవిష్కరిస్తూనే, ఈ సినిమా కొత్త పంథాలో ప్రయాణించనుంది.
భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్, ఆనంద్ ఎల్. రాయ్, హిమాంశు శర్మ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా 2024 అక్టోబరులో షూటింగ్ ప్రారంభించుకోనుంది. 2025లో థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని టీ-సిరీస్, కలర్ యెల్లో సమర్పిస్తుండగా, దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
-
Home
-
Menu