బాలీవుడ్‌ను వీడుతున్న సృజనాత్మక దర్శకుడు

బాలీవుడ్ లో ప్రస్తుత పరిస్థితులు తనకు అసహ్యంగా మారిపోయాయని, అందుకే ఇకపై దానిని పూర్తిగా వదిలేయాలని నిర్ణయించుకున్నానని ప్రముఖ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ వెల్లడించాడు. గడిచిన కొంతకాలంగా బాలీవుడ్‌లో సృజనాత్మకతకు విలువ లేకుండా పోయిందని, సినిమాలు ఏకంగా లెక్కలతోనే నడుస్తున్నాయనే భావన కలుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇటీవలి బాలీవుడ్ పరిస్థితులను చూస్తే, ప్రతి ఒక్కరూ రూ.500 కోట్లు, రూ.800 కోట్లు వసూలు చేయడమే లక్ష్యంగా సినిమాలను రూపొందిస్తున్నారని, అటువంటి వాతావరణంలో తనలాంటి వ్యక్తులకు చోటు లేదని కశ్యప్ వ్యాఖ్యానించాడు. సినిమా ప్రారంభించే ముందే దానిని ఎంతకు అమ్మొచ్చు, ఎంత ఆదాయం వస్తుందనే లెక్కలు పెరిగిపోయాయని, ఈ పరిస్థితి తనలోని దర్శకుడిని మానసికంగా మట్టికరిపించిందని చెప్పాడు.
ఈ అనిశ్చిత వాతావరణాన్ని ఎదుర్కొంటూ గడిపిన ఏడాదిలో తాను చాలా ఒత్తిడికి లోనయ్యానని, ఇకపై బాలీవుడ్ కు చెందిన వారందరినీ దూరంగా ఉంచుకుంటానని స్పష్టం చేశాడు. తన కెరీర్‌ను నడిపించుకునేందుకు వేరే మార్గాలు అన్వేషిస్తున్నానని, వచ్చే ఏడాదికల్లా ముంబైని పూర్తిగా వీడి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు.
గత కొంత కాలంగా దక్షిణాదిన బిజీగా మారుతున్నాడు అనురాగ్ కశ్యప్. సౌత్ లోని అన్ని భాషల్లోనూ నటుడిగా బిజీ అవుతున్నాడు. విజయ్ సేతుపతి తో నటించిన ‘మహారాజ‘ అనురాగ్ కి నటుడిగా మంచి పేరు తీసుకొచ్చింది. తెలుగులోనూ అడవి శేష్ ‘డకాయిట్‘లో పవర్ ఫుల్ పోలీస్ గా కనిపించబోతున్నాడు అనురాగ్ కశ్యప్.
-
Home
-
Menu