పార్లమెంట్‌లో విక్కీ కౌశల్ ‘ఛావా’ ప్రత్యేక ప్రదర్శన

పార్లమెంట్‌లో విక్కీ కౌశల్ ‘ఛావా’ ప్రత్యేక ప్రదర్శన
X
మార్చి 27న జరిగే ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు హాజరు కానున్నారు.

విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఛావా’ సినిమాకు పార్లమెంట్‌లో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటైంది. మార్చి 27న జరిగే ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు హాజరు కానున్నారు. మరాఠా వీర యోధుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించిన ఈ చిత్రానికి లక్ష్మణ్ ఉఠేకర్ దర్శకత్వం వహించగా, దినేష్ విజన్ నిర్మించారు. ప్రధాన పాత్రలో నటించిన విక్కీ కౌశల్ కూడా చిత్ర బృందంతో కలిసి ఈ ప్రదర్శనకు హాజరవ్వనున్నాడు.

ఛత్రపతి సంభాజీ మహారాజ్ సాహసోపేత జీవితాన్ని, మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటాన్ని ఈ సినిమా ఆవిష్కరించింది. పార్లమెంట్‌లో ప్రత్యేక ప్రదర్శన నిర్వహించడం ద్వారా ఈ చారిత్రక నాయకుడి మహత్తును ప్రభుత్వం గుర్తిస్తోందని చెప్పొచ్చు. ఇప్పటికీ బాక్సాఫీస్‌ను శాసిస్తున్న ‘ఛావా’ తన నాలుగో వారంలోనూ రికార్డులు తిరగరాస్తోంది. ఇప్పటికే హిందీ వెర్షన్ ‘బాహుబలి 2’ లైఫ్‌టైమ్ కలెక్షన్లను దాటేసి, ఆల్‌టైమ్ టాప్-6 హిందీ సినిమాల జాబితాలో చోటు సంపాదించింది.

ప్రస్తుతం ‘ఛావా’ ‘పఠాన్’ (రూ. 524.53 కోట్లు), ‘గదర్ 2’ (రూ. 525.7 కోట్లు) కలెక్షన్లను సమీపిస్తోంది. త్వరలోనే ఈ మైలురాయిని చేరుకునే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. విక్కీ కౌశల్‌కు తోడు రష్మిక మందన్నా, విన్నీత్ సింగ్, అక్షయ్ ఖన్నా, డయానా పెంటి, అశుతోష్ రాణా, దివ్య దత్త వంటి ప్రముఖ తారాగణం ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ చిత్రానికి విమర్శకుల నుంచి, ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభిస్తోంది.

Tags

Next Story