మరో రాష్ట్రంలోనూ ‘చావా’ కు టాక్స్ ఫ్రీ !

విక్కీ కౌశల్, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన బాలీవుడ్ పీరియాడిక్ డ్రామా "చావా". ఈ చిత్రం ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదలైంది. వసూళ్ళలో ఓ రేంజ్ లో దూసుకు పోతోంది. ఇక ఈ సినిమాను గోవా రాష్ట్రంలో కూడా పన్ను రహితంగా ప్రకటించారు. మధ్యప్రదేశ్‌లో ఈ సినిమా ఇప్పటికే ట్యాక్స్ ఫ్రీగా అనౌన్స్ చేయగా.. ఇప్పుడు గోవాలోనూ అదే గుర్తింపును పొందింది.
గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్ ద్వారా ఈ వార్తను తెలిపారు. "దేవ, దేశ, ధర్మ కోసం పోరాడిన ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత గాథ ఆధారంగా రూపొందిన 'చావ్వా' సినిమాను గోవాలో పన్ను రహితంగా ప్రకటించడం నాకు ఆనందంగా ఉంది. ఈ సినిమాలో విక్కీ కౌశల్ శంభాజీ మహారాజ్ పాత్రను పోషించారు. మొఘలులపై, పోర్చుగీస్ శక్తులపై ఆయన చేసిన పోరాటం.. ఆయన త్యాగం మనందరికీ స్ఫూర్తిదాయకం" అని ఆయన తెలిపారు.
ఇదే విధంగా, ఫిబ్రవరి 19న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కూడా ఈ చిత్రాన్ని పన్ను రహితంగా ప్రకటించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతిని పురస్కరించుకుని ఈ నిర్ణయాలు తీసుకున్నారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఈ సినిమాపై ప్రజల నుంచి వస్తున్న మంచి స్పందనను ప్రశంసించారు. "ఈ చిత్రం చరిత్రను వక్రీకరించకుండా నిర్మించబడిందని వినిపిస్తోంది. ఇంకా నేను చూడకపోయినా.. ఇది మంచి సినిమా అని ప్రజలు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా దీనిని ట్యాక్స్ ఫ్రీగా ప్రకటించాలనే డిమాండ్లకు నేను సానుకూలంగా ఉన్నాను" అని ఆయన పేర్కొన్నారు.
లక్ష్మణ్ ఉఠేకర్ దర్శకత్వంలో రూపొందిన "చావా" చిత్రంలో విక్కీ కౌశల్, రష్మిక మందన్న, అక్షయ్ ఖన్నా ముఖ్య పాత్రల్లో నటించగా, డయానా పెంటీ, దివ్య దత్త, వీనీత్ కుమార్ సింగ్, అశుతోష్ రాణా వంటి ప్రముఖ నటులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా శివాజీ సావంత్ రాసిన అదే పేరుతో వచ్చిన మరాఠీ నవల ఆధారంగా రూపొందించబడింది.
-
Home
-
Menu